పర్యాటకశాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం రుషికొండపై నిర్మిస్తున్న నూతన కాటేజీల నిర్మాణం కోసం కొండలను తవ్వేసే పనులు గతేడాది నుంచి జరుగుతున్నాయి. సీఆర్జెడ్ నిబంధనలు పాటించకుండా ప్రభుత్వం రుషికొండ మొత్తాన్ని తవ్వేస్తూ, ప్రకృతి విధ్వంసం చేస్తున్నారంటూ హైకోర్టు, గ్రీన్ ట్రిబ్యూనల్ లో కూడా కొందరు పర్యావరణ వేత్తలు, రాజకీయ నాయకులు కూడా కేసులు వేశారు.
అయితే నిన్నటి నుంచి రుషికొండ మొత్తం పచ్చగా కనిపిస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విశాఖలో వచ్చే నెలలో జరగనున్న జి-20 సదస్సుకు వచ్చే ప్రతినిధుల కంట రుషికొండపై ప్రభుత్వం చేసిన ప్రకృతి విధ్వంసం కనిపించకుండా ఇలా చేశారంటూ ఆ ఫోటోలను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి.
ఆ పనుల్లో భాగంగానే ఈ మ్యాటింగ్ చేశామని ఏపీటీడీసీ అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు కొంత భాగం పర్చామని, మరికొద్ది రోజుల్లో మిగిలిన భాగాల్లోనూ ఇదే విధంగా జియోమ్యాటింగ్ చేస్తామని చెప్తున్నారు. దీనివల్ల తొలిచిన భాగాల నుంచి మట్టి, రాళ్లు కింద పడకుండా ఉంటాయని, పచ్చదనం కూడా అక్కడ పెరుగుతుందని అంటున్నారు.