Lokesh Liquor Deaths: కల్తీసారా మరణాలకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ సర్కారీ హత్యలే అని ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం.. టీడీపీని విమర్శించడం మానుకుంటే మంచిది అన్నారు. శవ రాజకీయాలకు జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఆయన మండిపడ్డారు. తండ్రి మృతదేహం దొరక్కముందే సీఎం సీటు కోసం సంతకాలు సేకరణ చేపట్టిన వ్యక్తి జగన్ రెడ్డి అని విమర్శించారు.
మనకు తెలిసి చనిపోయింది 25 మందే, తెలియకుండా రాష్ట్రవ్యాప్తంగా చనిపోయిన వారి సంఖ్య ఇంకా తేలాల్సి ఉందన్నారు లోకేష్. కల్తీసారా మరణాలపై శాసన మండలిలో ప్రభుత్వం చర్చకు రాకుండా పారిపోయిందని విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా కారణంగా జరిగిన మరణాలపై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం ఇచ్చే ప్రకటన విని వెళ్లిపోవాలంటే ఎలా? అని మండిపడ్డారు.
జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్న మరణాలపై పోస్టుమార్టం రిపోర్టు రాకముందే.. అవన్నీ సహజ మరణాలని మంత్రులే తేల్చడమేంటని మండిపడ్డారు లోకేశ్. జగ్గారెడ్డిగూడెంలో చోటు చేసుకున్న మరణాలపై ఉన్నతస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే వారి కుటుంబాలకు మద్ధతుగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామన్నారు.
ఇటు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్న ఈ మరణాలపై ఏపీ అసెంబ్లీ అట్టుడికింది. ఈ మరణాలన్నీ నాటు సారా కారణంగానే చోటుచేసుకున్నాయని విపక్ష టీడీపీ ఆరోపించగా.. అందులో వాస్తవం లేదంటూ అధికార వైసీపీ బదులిచ్చింది. ఇరు వర్గాల మధ్య వాద ప్రతివాదనలు చోటుచేసుకున్నాయి. చివరకు అసెంబ్లీ నుంచి టీడీపీకి చెందిన ఐదుగురు సీనియర్ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కూడా రచ్చ కొనసాగింది.
అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలకు మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ముందు నిరసనకు దిగారు. నారా లోకేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. స్వయంగా లోకేశ్ కూడా ఓ ప్లకార్డు పట్టుకుని నిరసనను ముందుండి నడిపించారు. జగన్ మోసం ఖరీదు ఈ 25 ప్రాణాలు అంటూ రాసి ఉన్న ప్లకార్డును లోకేశ్ పట్టుకున్నారు.
కల్తీ సారా తీసుకోవడం వల్లే వీళ్లంతా మృతి చెందారని.. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ (TDP) ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. దీనికి మంత్రులు కౌంటర్ ఇవ్వగా.. సీఎం జగన్ (AP CM YS Jagan) ఏపీ అసెంబ్లీ (AP Assembly)లో ప్రకటన చేస్తూ.. అవన్నీ సహజమరణాలేనన్నారు. టీడీపీ కావాలనే అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు.