జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టూర్ తీవ్ర ఉద్రిక్తల నడుమ కొనసాగుతోంది. సాయంత్రం మొదలైన ర్యాలీ రాత్రి వరకు కొనసాగుతోంది. అయితే మధ్యలో పవన్ టూర్ కు పవర్ కట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవన్ ను చూసేందుకు భారీగా అభిమానులు ఎగబడడం చూసి తట్టుకోలేక.. ఇలా పవర్ కట్ చేశారంటూ.. జనసైనికులు మండిపడుతున్నారు.
పవన్ ర్యాలీతో నగరంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాయంత్రం చీకటిపడే సమయానికి విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న పవన్ కల్యాణ్.. బీచ్ రోడ్డులోని నోవాటెల్‌కు ర్యాలీగా వెళ్లారు. ఆయన ర్యాలీ సాగే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా స్ట్రీట్ లైట్లు కూడా వెలగలేదు. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా పవన్ కల్యాణ్ ర్యాలీ కొనసాగించారు. దీంతో జనసైనికుల తెగింపుపై పవన్ ఆనందం వ్యక్తం చేశారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా ఎయిర్ పోర్టుపై మంత్రుల కాన్వాయ్ పై దాడి.. కక్ష పూరితంగా చేసిందే అని వైసీపీ నేతలు ఆరోపించారు. దానిపై పవన్ స్పందించాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై స్పందించిన పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. పవన్ పర్యటన నుంచి దృష్టి మళ్లించేందుకే కోడికత్తి తరహా నాటకాలను వైసీపీ తెరలేపిందని నాదెండ్ల మనోహార్ ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖ విమానాశ్రయంలో మంత్రుల మీద జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేశారని మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉంది. అసలు మంత్రుల కార్ల మీద దాడి జరిగినట్లు కానీ, అది జనసేన కార్యకర్తలు చేసినట్లు కానీ పోలీసులు నిర్ధారించలేదు అన్నారు. కేవలం పవన్ కళ్యాణ్ టూర్ కు మైలేజ్ రాకూడదనే కుట్రతోననే ఇలాంటి నాటకాలకు తెర తీశారని నాదెండ్ల మండిపడ్డారు.
మరోవైపు పవన్ తన పర్యటనలో భాగంగా రాత్రి విశాఖపట్నం అర్బన్, రూరల్ పరిధిలోని జనసేన ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా జనసేన భవిష్యత్తు కార్యాచరణపై పవన్ కల్యాణ్ పార్టీ నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
రేపు (అక్టోబర్ 16) ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేన పార్టీ నిర్వహించే జనవాణి కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొంటారు.
ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల సమస్యలపై వచ్చే ఆర్జీలను పవన్ కల్యాణ్ స్వీకరించనున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అక్కయపాలం హైవే రోడులోని పోర్ట్ కళావాణి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నట్టుగా జనసేన వర్గాలు తెలిపాయి.