Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ అరంగేట్రానికి కారణం ఏంటి.. తన లక్ష్యం ఏంటి అన్నది నేతలకు వివరించారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఈ పర్యటనలో వైసీపీ మంత్రులపై దాడి చేశారన్న ఆరోపణలతో 9 మంది జనసేన నేతలను పోలీసులను అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా అరెస్ట్ అయిన నేతల కుటుంబాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మానవాళికి ప్రజాస్వామ్యం ఒక వరమని, సామాన్యుల హక్కులకు రక్షణ దక్కితేనే.. ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందన్నారు. రాజ్యాంగంలో హక్కులు, బాధ్యతలు అందరికీ సమానమేనని.. ప్రజాస్వామ్యంలో నియంత పోకడలు చెల్లవని, రౌడీలు రాజ్యాలు ఏలకూడదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రౌడీలు రాజ్యమేలకూడదన్నదే జనసేన లక్ష్యమన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు ఇచ్చిందని గుర్తుచేశారు. అధికారంలో ఉన్నవారు రౌడీలు మాదిరి ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. కనీసం సంస్కారం పాటించే సంప్రదాయం కూడా ఈ రాష్ట్రంలో లేదని మండిపడ్డారు.
చట్టం కొంతమందికి ఎందుకు బలంగా పనిచేస్తుంది అన్న సందిగ్ధంలో.. ఆలోచనలతో ఒక పయనం ఈరోజు ఈ రీతిగా ఒక సమూహాన్ని తయారు చేసే రీతిలో నడిపిందని స్పష్టం చేశారు. గతంలో ఎన్నికల అనంతరం పార్టీ ఆఫీసులో ఓ మహిళ తనని కలవడం జరిగిందని తెలిపారు. అయితే తన 14 ఏళ్ల కుమార్తెను అత్యాచారం చేసి చంపేశారని. ఎవరు పట్టించుకోలేదని అత్యాచార ఘటనకు సంబంధించిన వివరాలు తనతో పంచుకుంది ఆ ఘటన ఎప్పుడూ తన మనసును కలిసివేస్తుంది అన్నారు.