వైసీపీ (YSRCP) ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా (MLA RK Roja).. ఇప్పుడు మంత్రయ్యారు. అసలు రోజా (Minister RK Roja) కు మంత్రి పదవి రాదని అటు పార్టీ, ఇటు ప్రభుత్వంలోని వారంతా గట్టిగా చెప్పినా.. ఆ ప్రచారాన్ని ఆమె పటాపంచలు చేశారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సీఎం జగన్ ఆమెకు టూరిజం, సాంస్కృతిక శాఖ బాధ్యతలను అప్పగించారు.
ఐతే మంత్రి పదవి దక్కడంలో రోజాకు కలిసొచ్చిన అంశాలు చాలానే ఉన్నాయి. నగరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ అసమ్మతి వర్గాలు తయారై తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నా ఆమె మాత్రం బలంగా నిలబడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను సూచించిన అభ్యర్థులను ఓడించేందుకు సొంతపార్టీ నేతలే యత్నించినా రోజా మాత్రం గెలిపించుకున్నారు. ఎంపీపీ ఎన్నిక సమయంలో వ్యతిరేక వర్గంగా నేరుగానే అమీతుమీ తేల్చుకొని తన పంతం నెగ్గించుకున్నారు.
ఇక మున్సిపల్ ఎన్నికల సమయంలో సర్జరీ చేయించుకొని ఇంటికీ, ఆస్పత్రికే పరిమితమయ్యారు. కానీ అక్కడి నుంచే నేతలకు దిశానిర్దేశం చేశారు. అంతేకాదు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎమ్మెల్యేగా వీడియో కాల్స్ ద్వారా అభివృద్ధి పనులపై సమీక్ష చేయడం, అధికారులకు ఆదేశాలివ్వడం వంటివి చేశారు. కొవిడ్ టైమ్ లో తన సొంత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సాయం చేశారమే.
వీటన్నింటికంటే ముఖ్యంగా అసెంబ్లీలోనూ, బయట ప్రతిపక్ష పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు, పంచ్ లతో ఎటాక్ చేయడం రోజాకు ప్లస్ పాయింట్ గా మారింది. అంతేకాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నుంచి ఎన్ని సవాళ్లు ఎదురైనా బలంగా నిలబడటం రోజాకు కలిసొచ్చింది. దీంతో సీఎం జగన్ ఆమెకు మంత్రిపదవి కట్టబెట్టారు. ఒకప్పుడు ఐరన్ లెగ్ అంటూ ఇంటా బయట విమర్శలెదుర్కొన్న రోజా.. ఇప్పుడు పాలిటిక్స్ లో లక్కీ హ్యాండ్ గా మారింది.