ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నుంచి రాజ్యసభ (Rajyasabha) కు నలుగురు వైసీపీ (YSRCP) అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలతో పాటు ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను అఫిడవిట్ లో పేర్కొన్నారు. నలుగురు అభ్యర్థుల్లో బీద మస్తాన్ రావు అత్యంత సంపన్నుడు కాగా.. ఆర్ కృష్ణయ్యకు అందరికంటే తక్కువ కేసులున్నాయి. విజయసాయి రెడ్డిపై ఎక్కువ కేసులుండగా.. నిరంజన్ రెడ్డిపై ఒక్క కేసు కూడా లేదు.
విజయసాయి రెడ్డి కుటుంబ ఆస్తులను రూ.21.57 కోట్లుగా పేర్కొన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, భవనాల విలువ రూ.21.42 కోట్లుగా, భార్య సునందరెడ్డి పేరుతో 1456 గ్రాముల బంగారం, 2.90 కోట్ల విలువైన వజ్రాలున్నట్లు తెలిపారు. అలాగే రూ.24.65 కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు. ఇక తనపై 8 ఈడీ కేసులు, 11 సీబీఐ కేసులున్నట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. ఏపీ సీఎం జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసుల్లో విజయసాయి ఏ-1గా విచారణను ఎదుర్కొంటున్నారు.
ఇక బీద మస్తాన్ రావు విషయానికి వస్తే.. మొత్తం రూ.243 కోట్ల కుటుంబ ఆస్తులు, రూ.84 కోట్ల అప్పులున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో రూ.93 కోట్ల స్థిరాస్తులు, రూ.150 కోట్ల చరాస్తులున్నట్లు తెలిపారు. తన పేరుతో రూ.120.72 కోట్లు, భార్య మంజుల పేరుతో రూ.19.85 కోట్లు, వారసత్వ ఆస్తులు రూ.9.43 కోట్ల ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. రూ.93 కోట్ల విలువైన వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, భవనాలు, కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే 7,597 గ్రాముల బంగారం, 7,825 గ్రాముల వెండి, రూ.8.02 కోట్ల విలువైన వజ్రాలున్నట్లు తెలిపారు రూ.16.21 కోట్ల అప్పులు, రూ.69 కోట్ల బ్యాంక్ రుణాలున్నట్లు బీదమస్తాన్ రావు తెలిపారు.
నిరంజన్ రెడ్డి వియానికి వస్తే తమ కుటుంబానికి రూ.75.91 కోట్ల ఆస్తులు, రూ.10.09 కోట్ల అప్పులున్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇందులో ఆయన పేరిట రూ.32.48 కోట్లు, భార్య వైదేహీ రెడ్డిపేరిట రూ.9.17 కోట్లున్నట్లు తెలిపారు. హిందూ అవిభాజ్య కుటుంబం కింద రూ.67.07 కోట్లు, కుమార్తె అక్షర రెడ్డి పేరుతో రూ.1.13 కోట్ల చరాస్తులున్నాయని అందులో రూ.4,273 బంగారు ఆభరణాలున్నట్లు తెలిపారు.
అలాగే తనకు బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్ బెంజ్, ఇన్నోవా, తన భార్యకు బెంజ్ కార్లు ఉన్నట్లు నిరంజన్ రెడ్డి తెలిపారు. వారసత్వంగా వచ్చిన భూమి విలువ రూ.14.04 కోట్లు, తన పేరుతో రూ.15.81కోట్లు, భార్య పేరుతో రూ.3.01 కోట్లు, హిందూ అవిభాజ్యకుటుంబం కింద వచ్చిన స్థిరాస్థుల విలువ రూ.4.72 కోట్లున్నట్లు నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే సాగర్ కన్వెన్షన్ బిజినెస్ సెంటర్లో 70 శాతం షేర్, నిరంజన్ అసోసియేట్స్ లో 34 శాతం వాటా భార్య పేరుతో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇక తనపై ఎలాంటి కేసులు లేవని అఫిడవిట్ లో నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. (Twitter/Photo)
ఆర్.కృష్ణయ్య విషయానికి వస్తే వైసీపీ అభ్యర్థుల్లో అత్యంత తక్కువ ఆస్తులున్నది ఈయనకే. తన కుటుంబ ఆస్తుల విలువ రూ.3.50 కోట్లు, అప్పులు రూ.39.26 కోట్లుగా పేర్కొన్నారు. తనకు ఇన్నోవా కారు, భార్యకు మరోకారున్నట్లు తెలిపారు. భార్య శబరి వద్ద రూ.14 లక్షల విలువైన 280 గ్రాముల బంగారం ఉండగా.., తన దగ్గర రూ.2లక్షలు విలువైన 40 గ్రాముల బంగారమున్నట్లు పేర్కొన్నారు. మార్కెట్ విలువ ప్రకారం తన పేరుతో రూ.1.05 కోట్లు, భార్య పేరుతో రూ.1.95 కోట్ల విలువైన భవనాలు, వ్యవసాయ, వ్యవసాయేతర భూములున్నయాని.. ప్రభుత్వ అప్పు రూ.43.86 కోట్లుగా ఉందన్నారు.