Mla Tulabharam: పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటారు. అందులోనూ తూర్పు గోదావరి జిల్లాలో ఆచారాలు, వ్యవహరాలు అంటే కాస్త కొత్తగానూ.. ఆశ్చర్యంగానే ఉంటాయి. అక్కడ గతంలో అల్లుడికి భారీస్థాయిలో సారె పంపిన కథనాలు చూశాం.. అదే అల్లుడు అత్తగారికి కూడా తమ తరఫున ఆషాడం సారె పంపిన వీడియోలు వైరల్ కూడా అయ్యాయి. తాజాగా ఓ ఎమ్మెల్యే తులాభారం గోదావరి జిల్లాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
బూర్లు అంటే పండుగ సమయాల్లో అందరూ చేసుకొని తినే బూర్లతోనే అమ్మవారికి ఆయన మొక్కు తీర్చుకున్నారు. ఆయన మొక్కు తీర్చుకోవడం వెనుక కార్యకర్త మొక్కే కారణం అంటున్నారు. ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి చెందిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎరుబండి రమేష్ శాసనసభ్యులుగా చిర్ల జగ్గిరెడ్డి మళ్ళీ గెలుపొందితే బూరెలతో తులాభారం వేయిస్తామని అమ్మవారికి మొక్కుకున్నాడు.
చిర్ల జగ్గిరెడ్డి కొత్తపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున 2004లో ఎమ్మెల్యేగా జగ్గిరెడ్డి ఎన్నికయ్యారు. ఆ తరువాత 2009లో పీఆర్పీ బండారు సత్యానందరావు చేతిలో ఓటమి పాలయ్యారు. తరువాత మళ్లీ 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి బరిలోకి దిగి.. టీడీపీ నుంచి పోటీ చేసిన బండారు సత్యానందరావుపై విజయం సాధించారు.
ప్రభుత్వ విప్ పదవి కూడా అనూహ్యంగానే వచ్చింది. ముందుగా నియమించిన విప్ లు ఉంటుండగానే.. గతేడాది తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన సీఎం జగన్.. అప్పటికప్పుడు కొత్తపేట ఎమ్మెల్యేగా ఉన్న చిర్ల జగ్గిరెడ్డికి విప్ హోదా కల్పిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. బడిబాట ..నాడు - నేడు కార్యక్రమ ప్రారంభోత్సవానికి పి గన్నవరం నియోజకవర్గానికి వెళ్లిన సీఎం జగన్ ఆ నిర్ణయం ప్రకటించారు.
2014లో ఎమ్మెల్యేగా గెలచిన ఆయనపై టీడీపీ హయాంలో పార్టీ మార్పు దిశగా పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చింది. కానీ, జగ్గిరెడ్డి తాను జగన్ తోనే ఉంటానని తేల్చి చెప్పారు. దానికే కట్టుబడి చీప్ విప్ పదవి అందుకున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యే అయిన తనకు ఈ సారి సీఎం జగన్ మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తారని ఆశిస్తున్నారు.