Jagananna Vidya Deevena: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమంపై పూర్తి ఫోకస్ చేస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. ఉన్న పథకాలకు సమయానికి డబ్బులు అందిస్తున్నారు. కొత్త పథకాల రూపకల్పన చేస్తున్నారు. పాత పథకాలకు చెప్పిన షెడ్యూల్ ప్రకారం విడతల వారీగా నగదు జమ చేస్తున్నారు. ఇందులో భాగంగా విద్యా దీవెన నగదు విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.
గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు 1,778 కోట్ల రూపాయలతో సహా ఇప్పటివరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల క్రింద ప్రభుత్వం సాయం అందించింది. ఇతర సంక్షేమ పథకాలతో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు లిమిట్స్ లేవని సీఎం స్పష్టం చేశారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకం కింద లబ్ధిచేకూరనుంది.
ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా ఐటీఐ విద్యార్ధులకు 10 వేలు ప్రతి ఏటా రెండు వాయిదాల్లో.. పాలిటెక్నిక్ విద్యార్ధులకు 15 వేల రూపాయలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు నేర్చుకునే వారికి 20 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం.
ఇందులో భాగంగా గురువారం కలెక్టర్ గిరీషా, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యే నవాజ్ భాషా, జెసి తమీమ్ అన్సారియా మదనపల్లిలో పర్యటించి సభ స్థలాలను పరిశీలించారు. పట్టణంలోని కదిరి రోడ్డు పక్కన టిప్పు సుల్తాన్ మైదానం, బీటీ ప్రభుత్వ కళాశాల మైదానం, చిప్పిలి డైయిరీ వెనుక ఉన్న ఖాళీ స్థలాలను ఇప్పటికే అధికారులు పరిశీలించారు.