ఢిల్లీ వేదికగా ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశంలోని ఉన్న 40కు పైగా రాజకీయ పార్టీల అధినేతలు ఈ సమావేశంలో పాల్గొని విలువైన సలహాలు ఇచ్చారు. అయితే ఈ సమావేశలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం ప్రత్యేకంగా నిలిచారు. జీ 20 సమావేశంలో ఏఏ అంశాలు చర్చించాలి అన్నదానిపై విలువైన సలహాలు కూడా ఇచ్చారు.
జీ20 అధ్యక్ష బాధ్యతలను నిర్వహించే అవకాశం రావడం భారతదేశానికి గర్వకారణమన్నా ప్రధాని మోదీ.. ఈ సదస్సును విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరి సహకారం కావాలని ప్రధాని అన్నారు. జీ20 సదస్సుకు అధ్యక్షత వహించడం.. దేశ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటడానికి లభించిన అపురూప అవకాశంగా అభివర్ణించారు. ప్రపంచమంతా ఇప్పుడు భారత్‌వైపు ఆసక్తిగా చూస్తోందన్నారు.
ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి దేశంలోని 40 రాజకీయ పార్టీల నేతలు.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. భారతదేశ అధ్యక్షతన జరగబోయే జీ20 సదస్సుకు సంబంధించి నిర్వహించనున్న కార్యక్రమాల గురించి ప్రధాని ఈ భేటీలో వివరించారు. ఆయా కార్యక్రమాల నిర్వహణలో అన్ని పార్టీల నేతల సహకారం కావాలని కోరారు.
దాదాపు ఏడాదిపాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున విదేశీయులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి.. దేశంలో పర్యాటక, స్థానిక ఆర్థికవ్యవస్థల వృద్ధికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇక.. దేశానికి ఈ అవకాశం రావడం గర్వకారణంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభివర్ణించారు. అయితే, దీన్ని దేశ ప్రయోజనాల కోసం, సరిహద్దుల్లో చైనా దాడులను నివారించడానికి, ఆ దేశంతో ఉన్న వాణిజ్యపరమైన అసమతౌల్యాలను సరిచేసుకోవడానికి ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం సంపాదించడానికి, ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశాలపై చర్యకు ఇతరదేశాల మద్దతును కూడగట్టడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అభిప్రాయపడ్డారు. దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పరారైనవారిని తిరిగి రప్పించే వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా ఖర్గే మోదీకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
జీ-20 అధ్యక్షత ఒక పార్టీ ఎజెండా కాదని.. ఇది దేశం మొత్తానికీ సంబంధించిన అంశమని టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ సమావేశం చిహ్నంపై మమతా కాస్త నిరాశ వ్యక్తం చేసినట్టు సమాచారం.. జీ20 చిహ్నంలో కమలం బదులు మరేదైనా వాడాల్సింది అని ఆమె అన్నట్టు తెలుస్తోంది.
జీ20 సదస్సుకు అధ్యక్షత వహించే అవకాశం భారతదేశానికి రొటేషన్ పద్ధతిలో వచ్చిందని, కాబట్టి దీన్ని ఏదో ప్రభుత్వ ఘనతగా ప్రచారం చేసుకోవద్దని సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజా సహా పలువురు విపక్ష నేతలు ఈ భేటీలో సూచించినట్టు సమాచారం. కాగా.. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్, జేడీయూ చీఫ్ లలన్ సింగ్ హాజరు కాలేదు. ఆర్జేడీ ప్రతినిధులు ఈ సమావేశానికి రాలేదు.
ఢిల్లీలో G20 పై జరిగిన అఖిలపక్ష సమావేశం లో పాల్గొన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. డిజిటల్ నాలెడ్జ్ అంశం పై మాట్లాడారు. ఆయన సూచించిన డిజిటల్ నాలెడ్జ్ అంశాన్ని తన ప్రసంగం లో ప్రస్తావించారు ప్రధాని మోదీ.. భారతదేశ భవిష్యత్ ప్రయాణం పై వచ్చే 25 ఏళ్లకు విజన్ డాక్యుమెంట్ సిద్దం చేసుకోవాలి అన్నారు చంద్రబాబు..
వచ్చే 25 ఏళ్లలో ప్రపంచం లో భారత్ నంబర్ వన్ లేదా నంబర్ 2 దేశం గా అవతరిస్తుంది అనీ, యువ శక్తి మన దేశానికి ఉన్న బలం అని చెప్పారు చంద్రబాబు. వారికి అవకాశాలు సృష్టించేలా ప్రభుత్వాల పాలసీల రూపకల్పన జరగాలి అనీ, దేశానికి ఉన్న మానవ వనరుల శక్తి ని, నాలెడ్జ్ ఎకానమీకి అనుసంధానించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు వస్తాయిని చంద్రబాబు సూచించినట్టు సమాచారం.