తాజాగా రైతులకు అధిరిపోయే శుభవార్త చెప్పారు. అదీ ఖరీఫ్ సీజన్ కు ముందే డబుల్ ఆఫర్ ప్రకటించారు. ఈనెల 28వ తేదీన పంట నష్టం పరిహారాన్ని, బకాయి ఉన్న సున్నా వడ్డీ మొత్తాన్ని నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రైతులకు ఎప్పుడూ అండగా నిలబడతామని ఏపీ సర్కార్ మరోసారి చెప్పకనే చెప్పింది.
గోదావరి వరదలు, అకాల వర్షాలు.. ఇతర వైపరిత్యాల కారణంగా పాడైన పంటకు నష్ట పరిహారం అందించేందుకు సిద్దమైంది. సీజన్ ముగియక ముందే పరిహారం అందించబోతుంది. నవంబర్ 28వ తేదీన పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45,998 మంది రైతులకు చెందిన 60,832 ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది.
ఇందులో 14 జిల్లాల పరిధిలో 24,199 మంది రైతుల 26,540 ఎకరాల్లో ఉద్వాన పంటలు (ఉల్లి, కూరగాయలు, అరటి) దెబ్బతినగా.. 20 జిల్లాల పరిధిలో 21,799 మంది అన్నదాతల 34,292 ఎకరాల్లో వ్యవసాయ పంటలు( వరి, పత్తి, వేరుశనగ, పెసర) పాడయినట్లు ఐడెంటిఫై చేసింది. ఎక్కువగా కోనసీమ జిల్లాలో 12,886 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు తెలిపారు.
ఈ పంట నష్టపరిహారానికి అర్హులైన రైతుల జాబితాలను ఇప్పటికే ఆర్బీకేలలో ప్రదర్శనకు ఉంచారు. ప్రస్తుతం 2022–23లో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 45,998 మంది అన్నదాతలకు ఈ నెల 28న 39.39 కోట్ల నగదు విడుదల చేయనున్నారు సీఎం జగన్. అలాగే అదే రోజు బకాయి ఉన్న సున్నా వడ్డీ నగదు కూడా నవంబర్ 28న రైతులకు బకాయి ఉన్న సున్నా వడ్డీ నగదు సైతం సీఎం జగన్ జమ చేయనున్నారు.