అధినేతే అన్నీ తానై వ్యవహరించే ప్రాంతీయ పార్టీల్లో సుదీర్ఘకాలం అసమ్మతి నేతగా కొనసాగడమనే అసాధారణ దృశ్యం. ముఖ్యనేతపై తిరుగుబావుటా ఎగరేసిన ఎందరో నేతలు త్వరలోనే తెరమరుగైపోవడం లేదా సైలెంటైపోవడం తరచూ జరిగేదే. కానీ ఆంధ్రప్రదేశ్ లోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో మాత్రం రెబల్గిరీ పూర్తి భిన్నంగా సాగుతున్నది. గడిచిన రెండేళ్లుగా రఘురామ విషయంలో సీఎం జగన్ కు వరుసగా ఎదురుదెబ్బలే తప్ప చెప్పుకోదగ్గ ఊరటేదీ లభించలేదు.
రెండున్నరేళ్ల క్రితం వైసీపీ సర్కార్ తో విభేదించిన రఘురామకృష్ణంరాజు రచ్చబండ పేరుతో ప్రతిరోజూ ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ సీఎం జగన్ పై తీవ్రస్థాయి విమర్శలు చేస్తూవచ్చారు. ఈక్రమంలోనే జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ పలు కోర్టుల్లో పిటిషన్లు వేయడం, అవి విచారణకు రావడం ఏపీ వ్యాప్తంగా టెన్షన్ రేకెత్తించింది. ప్రతిగా రఘురామపైనా పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. అరెస్టు భయంతో ఢిల్లీకే పరిమితమైన రఘురామ రెండున్నరేళ్లుగా సొంత నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు..
మధ్యలో వచ్చినా తిరిగి ఢిల్లీ వెళ్లిపోతున్న రఘురామను ఆ మధ్య రాజద్రోహం కేసు కింద అరెస్టు చేసిన వైసీపీ సర్కార్ ఒక రోజు పాటు మాత్రం సీఐడీ కార్యాలయంలో ఉంచగలిగింది. అయితే రాజద్రోహం కేసును సవాలు చేస్తూ రఘురామ చేసిన న్యాయపోరాటం చివరికి దేశంలో సంచలన మార్పునకు దారితీసింది. రాజకీయ ప్రయోజనాల కోసం రాజద్రోహం కేసులు తగవంటూ సుప్రీంకోర్టు ఏకంగా ఆ చట్టాన్నే (ఐపీసీ సెక్షన్ 124(ఏ))ను రద్దు చేసింది.
కడప రెడ్లు, ఏపీ సీఎం జగన్, చంద్రబాబు, ఏపీ న్యూస్" width="875" height="583" /> రఘురామను ఎలాగైనా నిలువరించాలని సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కారు గత రెండున్నరేళ్లుగా అన్ని రకాల ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించలేదు. రఘురామపై ఏపీ సర్కారు పెట్టిన కేసులను కోర్టులు కొట్టేయగా, ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు విషయంలోనూ వైసీపీకి తాజాగా పరాభవం తప్పలేదు.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అనర్హత పిటిషన్‌పై లోక్‌సభ స్పీకర్ కార్యాలయం తాజాగా స్పందించింది. సీఎం జగన్‌పై, పార్టీపై ఆరోపణలు, విమర్శలు చేసినంత మాత్రాన ఎంపీపై అనర్హత వేటు కుదరదని స్పీకర్ కార్యాలయం స్పష్టం చేసింది. లోక్ సభలో పార్టీ విప్ ధిక్కరించిన వారిపైనే అనర్హత వేటు పడుతుందని, రఘురామ అలాంటిదేమీ చేయలేదు కాబట్టి ఇప్పుడున్న నిబంధన ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోలేమని స్పీకర్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
రఘురామరాజుపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ లోక్‌సభ చీఫ్ విప్ మార్గాని భరత్ ఇచ్చిన పిటిషన్‌పై లోక్‌సభ స్పీకర్ కార్యాలయం ఈ మేరకు స్పందించింది. నిజానికి వైసీపీ ఇచ్చిన పిటిషన్ ను స్పీకర్ ఓం బిర్లా ప్రివిలేజ్ కమిటీకి పంపగా, ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ సునీల్‌కుమార్ సింగ్ దీనిపై విచారణ చేపట్టారు. ప్రవిలేజ్ కమిటీ విచారణ ఇంకా ముగియకముందే, అనర్హత వేటు వేయలేమంటూ స్పీకర్ కార్యాలయం పేర్కొనడం గమనార్హం. రఘురామ వివరణనను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ ఆఫీస్ వర్గాలు పేర్కొన్నాయి.
రఘురామపై అనర్హత వేటు సాధ్యపడదని వెల్లడించిన స్పీకర్ కార్యాలయ వర్గాలు ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఉదంతాన్ని సైతం ప్రస్తావించాయి. బండి సంజయ్ పై పోలీసులు దాడి చేసిన 24 గంటల్లోపు తమకు సమాచారం ఇవ్వలేదని, అందుకే ప్రవిలేజ్ కమిటీ.. హోం సెక్రటరీతోపాటు తెలంగాణ పోలీస్ అధికారులను పిలిచి విచారించిందని లోక్ సభ వర్గాలు తెలిపాయి. అదే రఘురామను అరెస్టు చేసిన తర్వాత స్పీకర్ కు 24 గంటల్లోపే సమాచారం ఇచ్చారని, అందువల్ల అరెస్టు వ్యవహారాన్ని కమిటీ పరిగణలోకి తీసుకోలేదని, కేవలం అనర్హత వేటు ఫిర్యాదునే కమిటీ పరిశీలిస్తున్నదని ఆ వర్గాలు తెలిపాయి.
తనపై అనర్హత వేటు అసాధ్యమని తొలి నుంచీ వాదిస్తోన్న రఘురామ చెప్పినట్లుగానే స్పీకర్ కార్యాలయం నుంచి సంకేతాలు వెలువడటం సీఎం జగన్, వైసీపీకి మరో పరాభవంగా మారిందనే వాదన వినిపిస్తోంది. అనర్హత వేటు నుంచి దాదాపు తప్పించుకున్న రఘురామ ఇక ఏపీలోనూ, అందునా సొంత నియోజకవర్గంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ రాకను అందుకు అవకాశంగా రఘురామ వాడుకోబోతున్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.
అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా జూలై 4న భీమవరానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు. పీఎం కు ముందే జూలై 2న రఘురామ నరసాపురం వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. జూలై 2న వచ్చే రఘురామ 3, 4 తేదీల్లో కూడా నరసాపురంలోనే ఉండబోతున్నారు. దీంతో తనకు అదనపు భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఆయన లేఖ రాశారు.
నర్సాపురం లోక్ సభ పరిధిలోకి వచ్చే భీమవరంలో ప్రధాని మోదీ పాల్గొనబోయే సభలో స్థానిక ఎంపీగా రఘురామకృష్ణంరాజు భాగంపంచుకోవాలని భావిస్తున్నారు. ఈ సభకు సీఎం జగన్ కూడా హాజరైన పక్షంలో ఆసక్తికర సీన్ నెలకొనే అవకాశముంది. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఏపీ సర్కారు అనవసర వివాదాలు కోరుకోనట్లయితే, రఘురామ కోరిన భద్రతను కేంద్రం అందజేస్తే గనుక ఆయన నరసాపురం రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. రఘురామను ఏపీలో అడుగుపెట్టనీయకుండా చేసిన జగన్ సర్కారుకు మోదీ పర్యటన సందర్భంగా షాకిచ్చేందుకు రఘురామ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.