YCP Minster Bus Yatra: సామాజిక న్యాయ భేరి పేరుతో 17 మంది కీలక మంత్రులు బస్సు యాత్రను ఘనంగా ప్రారంభించారు.. శ్రీకాకుళం నుంచి వయా రాజమండ్రి మీదుగా అనంతపురం వరకు ఈ సభ సాగాల్సి ఉంది. అయితే తొలి రోజే బస్సు యాత్రకు అద్భుత స్పందన వస్తోందని మంత్రులు జబ్బలు చరుచుకున్నారు. బస్సు యాత్ర ప్రారంభమైన చోట జనం బాగా వచ్చారని.. ఆ స్పందన చూసి విపక్షాలకు మతి భ్రమించిందంటూ మంత్రులు భారీ డైలాగ్ లు చెప్పారు.. కానీ ఆ వెంటనే కాసేపటికి కీలక మంత్రి సొంత ఇలాకాలో బస్సు యాత్రకు ఫాక్ తగిలింది.
అంతకుముందు సామాజిక న్యాయ భేరి పేరుతో ఆంధ్రప్రదేశ్ మంత్రులు బస్సు యాత్రను ప్రారంభించారు. ఉదయం శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైన ఈ యాత్ర నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. సామాజిక న్యాయ భేరి పేరుతో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు సాగే ఈ యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు జరిగిన సామాజిక న్యాయాన్ని బస్సుయాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తూ.. యాత్రను విజయవంతంగా మొదలు పెట్టారు. భారీగా హంగామా.. అనుచరుల జైజైధ్వానాల మధ్య శ్రీకాకుళంలో ఈ బస్సు యాత్రం వైభవంగా ప్రారంభమైంది. సెవెన్ రోడ్స్ జంక్షన్లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగహ్రానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రులు బస్సుయాత్ర ప్రారంభించారు.
శ్రీకాకుళంలో బస్సు యాత్ర చిలకపాలెం, సుభద్రాపురం, రణస్థలం, పైడిభీమవరం మీదుగా పూసపాటిరేగ వద్ద విజయనగరం జిల్లాల్లోకి ప్రవేశించింది. అక్కడి నుంచి కందివలస, జమ్ము నారాయణపురం మీదుగా విజయనగరం న్యూ పూర్ణ జంక్షన్‌కు చేరుకుంది.. అయితే బస్సు యాత్రంలో కీలక మంత్రి పాల్గొన్న సొంత ఇలాకా.. దానికితోడు గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన జిల్లా కావడంతో సభ సూపర్ సక్సెస్ అవుతుంది అనుకున్నారు. ఉదయం నుంచి భారీగా జనసమీకరణ కూడా చేశారు..
కానీ ఊహించని రీతిలో వరుణుడు వారి ఆశలపై నీళ్లు జల్లాడు. విజయనగరానికి బస్సు యాత్ర చేరుకున్న సమయంలో పట్టణంలో భారీగా వర్షం కురిసింది. బస్సు అడుగు పెట్టిన దగ్గర నుంచి కుండపోత వర్షం మొదలైంది. భారీ వర్షం ఎంతసేపటికీ బ్రేక్ ఇవ్వకపోవడానికి తోడు అక్కడ సరైన షెల్టర్ లేకపోవడంతో.. జనం చల్లగా అక్కడి నుంచి జారుకున్నారు.
వర్షం చాలాసేపటి వరకు తెరిపి ఇవ్వకపోవడంతో కార్యకర్తలు, ప్రజలు సభ నుండి వెళ్లి పోయారు. మరోవైపు బస్సు యాత్రలో వచ్చిన మంత్రులు దిగటానికి కూడా వర్షం వీలు కల్పించలేదు. వర్షం తగ్గిన తరువాత మంత్రులంతా స్టేజి మీదకి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. కానీ అక్కడ నాయకులు అనుచరులు తప్పం జనం లేరు.. దీంతో సభ రద్దు చేసుకొని మంత్రులు తిరిగి బస్ లోకి వెళ్లిపోయారు.
ఇక శుక్రవారం విశాఖపట్నం జిల్లాలో జరగనున్న బస్సు యాత్ర కోసం మంత్రులు వెళ్లిపోయారు. బస్సు యాత్ర కోసం భారీ ఏర్పాట్లు చేసి, భారీ జన సమీకరణ జరిగిన తర్వాత సభ రద్దు అవ్వడంతో వైసీపీ నాయకులు తీవ్ర నిరాశ చెందారు. అంతకుముందు శ్రీకాకుళం జిల్లాలో జరిగిన బస్సు యాత్రలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. అభివృద్దిలో మార్పును ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. రాష్ట్రంలో అవినీతి లేని పాలన సాగుతుందన్నారు.