ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan) దావోస్ (Davos-2022) చేరుకున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum) సదస్సులో పాల్గొనేందుకు ఆయన దావోస్ వెళ్లారు. భారతకాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఆయన స్విట్జర్లాండ్ లోని జ్యూరిక్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నట్లు తెలుస్తోంది. జురెక్ ఎయిర్‌పోర్టుకు నుంచి రోడ్డు మార్గంలో దావోస్ చేరుకున్నారు.
సీఎం జగన్ కు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖామంత్రి గుడివాడ అమర్ నాథ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ప్రిన్సిపల్ కార్యదర్శి ఆరోఖ్యరాజ్, స్విట్జర్లాండ్‌లో భారత ఎంబసీ రెండో కార్యదర్శి రాజీవ్‌కుమార్, ఎంబసీలో మరొక రెండవ కార్యదర్శి బిజు జోసెఫ్ తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
శుక్రవారం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి జురెక్ బయలుదేరిన జగన్.. అనుకున్న సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో ఇంధనం ఎక్కించుకున్న తర్వాత టేకాఫ్ లేట్ అవడంతో లండన్ వెళ్లాల్సి వచ్చిందని మంత్రి బుగ్గన తెలిపారు. జురెక్ లో రాత్రి 10 గంటల తర్వాత విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అనుమతి లేకపోవడంతో జగన్ లండన్‌లోనే బసచేసి శనివారం జురిక్ చేరుకొని అక్కడి నుంచి దావోస్ వెళ్లారు.