కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం చిత్త శుద్దితో ఉంది అన్నారు. ప్రతి కుటుంబానికి కొడుకులా అండగా ఉంటాను అన్నారు. కరోనా సంక్షోభంలోనూ.. పేదల కష్టాలు తెలుసు కాబట్టి.. సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రెండేళ్ల కాలంలో ప్రతీ కుటుంబానికి లబ్ది చేకూరేలా సంక్షేమ పాలన అందించామని పేర్కొన్నారు. అంతకుముందు కోవిడ్ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారికి ఏపీ అసెంబ్లీ నివాళి అర్పిస్తోందన్నారు.
మహానేత కోసం ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ఓదార్పుయాత్రతో పరామర్శించాను అని గుర్తు చేసుకున్నారు. అందకే తనకు ప్రాణం విలువ బాగా తెలుసన్నారు. అందుకే ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఫోన్ చేసిన 20 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చేలా మార్పులు చేశాం. ప్రతి 2 వేలమంది జనాభాకు ఒక ఏఎన్ఎంను ఏర్పాటు చేశామన్నారు.. ఏపీలో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు.
రాష్ట్రంలో కోవిడ్ రోగుల కోసం 47 వేల బెడ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. కోవిడ్ కేర్ సెంటర్లలోనూ 52 వేల బెడ్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. 18 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. కోవిడ్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచిత వైద్యం అందిస్తున్న సంగతి గుర్తు చేశారు. గడిచిన 14 నెలల్లో కోవిడ్ నియంత్రణకు తమ ప్రభుత్వం 2,229 కోట్లు కేటాయించిందన్నారు.
కరోనా పై పోరాటంలో ముందుంటున్నామన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చామన్నారు. దీని చికిత్స కోసం 17 ఆస్పత్రులను నోటిఫై చేశామని చెప్పారు. టీచింగ్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. 50 ఆక్సిజన్ ట్యాంకర్లను కొనుగోలు చేశామని గుర్తు చేశారు. నర్సులు, డాక్టర్లు, హెల్త్ వర్కర్లు, అధికారుల కృషి కారణంగా.. మరణాల రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మనమూ ఉన్నామన్నారు.
కోవిడ్ కేసులను వెంటనే గుర్తించి వేగంగా వైద్యం అందించడం ద్వారానే మరణాల రేటును తగ్గించగలుగుతున్నామని అన్నారు సీఎం జగన్. దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేయాలంటే.. 172 కోట్ల వ్యాక్సిన్ డోసులు అవసరమని.. కానీ దేశంలో నెలకు 7 కోట్ల డోసుల ఉత్పత్తికి మాత్రమే సామర్థ్యం ఉందన్నారు. ఇక దేశంలో ఇప్పటివరకు 18.44 కోట్ల మందికి మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తైందన్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ వేయాలంటే.. 7 కోట్ల డోసులు అవసరం ఉందన్నారు.
వ్యాక్సిన్ కోటా కేటాయింపు ప్రక్రియ పూర్తిగా కేంద్రం నియంత్రణలో ఉంది.. ఆ వాస్తవాలు తెలిసి కూడా కొందరు వక్రీకరించడం చూస్తే మనసుకు చాలా బాధ కలుగుతోంది అన్నారు. వాస్తవాలు అన్నీ తెలిసి కూడా విపక్షాలు, కొన్ని మిడియాలు తప్పుడు ప్రచారాలు చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ల కోసం ఏపీ ప్రభుత్వం ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను కూడా పిలిచిందని గుర్తు చేశారు. వ్యాక్సిన్లు ఎలాగైనా తెస్తాం.. ప్రజలకు ఉచితంగా ఇస్తాంమన్నారు.
కరోనా విషయంలో కేంద్రం చేతులెత్తేసినా కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం నిలదీయడం లేదని విమర్శలకు.. అసెంబ్లీ వేదికగానే సీఎం జగన్ సమాధానం చెప్పారు. కరోనా సమయంలో ఒఖరిని ఒకరు విమర్శించుకోవడంలో అర్థం లేదన్నారు. తప్పు జరిగిపోయిందని.. ఇలాంటి సమయం తప్పు చేశావు అని పదే పదే విమర్శించి ఏం లాభం అన్నారు. సరిదిద్దుకునే అవకాశం లేనప్పుడు ఢిల్లీ ప్రభుత్వం ఏం చేయలేదని విమర్శించడం కన్నా.. కలిసి అందరం కలిసి ముందుకు వెళ్లడం మంచిది అన్నారు సీఎం జగన్. (File photo)