AP Floods: ఆంధ్రప్రదేశ్ ను భారీ వర్షాలకు తోడు.. వరదలు భయపెడుతున్నాయి. ఒకటి రెండు రోజులు గ్యాప్ ఇచ్చి.. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలపై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో మూడు జిల్లాలో వరద గుప్పిట్లో భయం భయంగా కడుపుతున్నాయి. అక్కడి పరస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ మూడు జిల్లాల ప్రజా ప్రతినిధులు అసెంబ్లీకి రాకుండా.. అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతున్నారు..
ముఖ్యంగా భారీ వరదల (AP Floods) ధాటికి చిత్తూరు జిల్లా (Chittoor District) లోని రాయల చెరువు పరిస్థితి ప్రమాదకరంగా మారింది. దీంతో ప్పటికప్పుడు అక్కడ తాజాగా పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు మంత్రులు తెలిపారు. చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం పనితీరు ప్రశంసనీయం, ప్రమాదకరంగా కురిసిన వర్షాలకు చిత్తూరు జిల్లాతో పాటు నెల్లూరు, కడప జిల్లాలో ఎక్కువ మంది ప్రజలు తాత్కాలికంగా ఇబ్బందులు పడుతున్నారు.
మూడు జిల్లాల్లో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి, ప్రభుత్వ యంత్రాంగం స్పందించిన తీరు వల్ల చాలా వరకూ నష్టనివారణ చేయగలిగామని, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. మంగళవారం మద్యాహ్నం డిప్యూటి సి.ఎం.నారాయణ స్వామి, తిరుపతి ఎం.పి.గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎం.ఎల్.ఎ. బియ్యపు మధుసూదన రెడ్డి, ఎం.పి.పి. మొహిత్ రెడ్డి రాయల చెరువును పరిశీలించి... మరమ్మత్తుల పనులను పర్యవేక్షించారు.
మంగళవారం తిరుపతి విమానాశ్రయం నుంచి ఆర్సీపురం మండలంలోని 11 గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన 10 టన్నుల నిత్యావసర సరుకులు హెలికాప్టర్ ద్వారా అక్కడకు చేరుకున్నాయి. అయితే వాటిని వాలంటీర్లు లేదా సహాయక చర్యలు చేపడుతున్న వారి ద్వారా సరఫరా చేయించొచ్చు.. కానీ ఆ బస్తాలను చెవిరెడ్డి తన సహచరులతో కలిసి హెలికాప్టర్ నుంచి కిందకు దించి ముంపు బాధితులకు అందించి గొప్ప మనసు చాటుకున్నారు.
వరద ముంచెత్తిన నేపథ్యంలో.. రాయలచెరువు సమీపంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితో అలమటించే పరిస్థితి ఉండకూడదేన్నారు చెవిరెడ్డి. చెరువుకు గండి పడినా ఏ ఒక్కరికీ ప్రాణహాని జరగకూడదనేది సీఎం జగన్ ఆదేశించారని చెవిరెడ్డి అన్నారు. ఇప్పటి వరకు 7 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఆయన చెప్పారు. ముంపు బాధితులకు సత్వర సాయం అందించేందుకు నేవీ హెలికాప్టర్ల ద్వారా దాదాపు 5 వేల మందికి నిత్యావసర సరుకులను గ్రామాలకు చేర్చినట్టు చెవిరెడ్డి వివరించారు.
మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు పడవలో ప్రయాణం చేసి ప్రజల ఇబ్బందులను మంత్రి గౌతమ్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు చిత్తూరు జిల్లాతో పాటు నెల్లూరు, కడప జిల్లాలో ఎక్కువ మంది ప్రజలు తాత్కాలికంగా ఇబ్బందులు పడినప్పటికీ ముఖ్యమంత్రి, ప్రభుత్వ యంత్రాంగం స్పందించిన తీరు వల్ల చాలా వరకూ నష్టనివారణ చేయగలిగామన్నారు.
ప్రజలు వరదతో సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు స్థానిక చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజలకు అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు మంత్రి గౌతం రెడ్డి. భద్రతా బలగాలు సహా జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలను, ఎన్డీఆర్ఎఫ్ బలగాల కృషిని ఆయన అభినందించారు. సహాయక చర్యులు ముమ్మరంగా సాగుతాయని అక్కడి ప్రజలకు ధైర్యం చెప్పారు.