గోదావరి వరద ఉద్ధృతిపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ ఆరా తీశారు. ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి, ఉభయగోదావరి జిల్లాల్లో వరద ప్రభావంపై తన కార్యాలయ అధికారులతో ఫోన్లో మాట్లాడారు.
ప్రస్తుతం గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, వస్తున్న వరదపై ఆయన వివరాలు అడిగితెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వరద పరిస్థితిపై, తీసుకుంటున్న చర్యలపై అధికారులు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నారు.
ముంపు ప్రాంతాల్లో ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, సహాయ శిబిరాల్లో వారికి భోజనం సహా అన్ని ఏర్పాట్లూ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలంలోని 32 ఆవాసాలు సహా, ఉభయగోదావరి జిల్లాల్లోని ముంపు గ్రామాలకు నిత్యావసర వస్తువుల పంపిణీపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, 2 లీటర్ల కిరోసిన్, 1 కేజీ కందిపప్పు, 1 లీటరు పామాయిల్, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళాదుంపలు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.