ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం (డిసెంబర్ 21) నాడు తన 49వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. దీంతో.. ఆయన అభిమానులు ప్రతీ నియోజకవర్గంలో జగన్ పుట్టినరోజును వేడుకలా నిర్వహించాలని నిర్ణయించారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని జగన్ మంగళవారం నుంచి ప్రజల మధ్యకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
విడతల వారీగా ఏపీలోని జిల్లాలో పర్యటనకు ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తన పుట్టినరోజు నాడు సీఎం జగన్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ జిల్లా పర్యటన ముగియగానే కడప జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు సొంత జిల్లాలో ఆయన పర్యటన సాగనుంది. ఇక ఇవాల్టి టూర్ షెడ్యూల్ను ఒక్కసారి పరిశీలిస్తే.. ఉదయం 10.15కు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు బయల్దేరి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు తణుకు పట్టణానికి చేరుకుంటారు.
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జరిగే బహిరంగసభలో ఆయన ప్రసంగింస్తారు. మధ్యాహ్నం 1కి ఆయన తాడేపల్లికి తిరిగి వెళ్తారు. ఇక.. పుట్టినరోజు సందర్భంగా జగన్ రాజకీయ ప్రస్థానాన్ని గురించి చెప్పుకోవాల్సి వస్తే.. తండ్రి వైఎస్ తన కొడుకు జగన్ను మీ చేతుల్లో పెడుతున్నానని ఓ రోడ్ షోలో ప్రకటించినప్పటికీ జగన్ అసలుసిసలు రాజకీయ ప్రస్థానం వైఎస్ అకాల మరణం తర్వాత ప్రారంభమైందని చెప్పవచ్చు.
వైఎస్ లేరన్న విషయాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని నల్ల కాలువ సాక్షిగా ప్రమాణం చేసిన జగన్ ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం వద్దని వారించినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ఓదార్పు యాత్ర నిర్వహించారు. తల్లి విజయమ్మ, జగన్ కాంగ్రెస్తో విభేదించి ఆ పార్టీకి రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మార్పు మొదలైంది. డిసెంబర్ 7, 2010న మరో 45 రోజుల్లో రాజకీయ పార్టీని ప్రకటిస్తానని చెప్పిన జగన్ మార్చి 2011న ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ని ప్రకటించారు.
2014లో స్వల్ప మెజారిటీ తేడాతో ముఖ్యమంత్రి పీఠానికి దూరమైన జగన్ 2019లో ముఖ్యమంత్రి కావడం కోసం నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. పాదయాత్రతో ఏపీని చుట్టేసిన జగన్కు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా ఘన విజయాన్ని కట్టబెట్టారు. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 151 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది. 25 లోక్సభ స్థానాలకు గానూ 22 స్థానాల్లో గెలుపొంది సత్తా చాటింది.