దశలవారీగా ఏపీలో మద్య నిషేధం చేస్తామని ఎన్నికల సందర్భంగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మద్యంపై ఎక్సైజ్ సుంకాలను పెంచనున్నారు. తద్వారా మద్యం ధర పెరిగి తాగేవాళ్ల సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో ఆదాయం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.
ప్రభుత్వమే సొంతంగా మద్యం దుకాణాలు నడపడం ద్వారా లైసెన్సుల రూపంలో వచ్చే ఆదాయాన్ని సర్కార్ నష్టపోనుంది. అయితే దుకాణాల లైసెన్స్‌దారులకు వారి వ్యాపారాన్ని బట్టి 10శాతం కమిషన్ ప్రభుత్వానికి మిగలనుంది.
మద్యంపై ఏడాదికి రూ.20వేల కోట్లు ప్రభుత్వానికి సమకూరుతోంది. ఇందులో కమీషన్ రూపంలో రూ.2వేల కోట్లు లైసెన్స్‌దారులకు పోతుంది. ఇప్పుడు ఆ సొమ్ము ప్రభుత్వానికి మిగులుతుంది.
ప్రభుత్వమే సొంతంగా మద్యం దుకాణాలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందనే దానిపై అధికారులు ఒక అంచనా వేశారు. నెలకు దాదాపు రూ.1.50లక్షలు ఖర్చువుతుందని తేల్చారు. ఖర్చులన్నీ పోనూ ఆదాయం బాగానే సమకూరుతుందని అధికారులు భావిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 4,380 మద్యం దుకాణాలు ఉన్నాయి. కొత్త పాలసీ అమలులోకి వస్తే దాదాపు 800 నుంచి 1300 వరకు దుకాణాలు తగ్గుతాయి.
ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించడం ద్వారా బెల్టు షాపులకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు.
అక్టోబర్ నెలలో మద్యం కొత్త పాలసీ అమలులోకి వస్తే.. నెల రోజుల్లో దీని ఫలితాలు ఎలా ఉంటాయన్నది తెలిసే అవకాశం ఉంది.