Jr NTR: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం జూనియర్ ఎన్టీఆర్ చుట్టూనే తిరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో ఉన్న అన్ని పార్టీలు ప్ర్తస్తుతం ఎన్టీఆర్ పేరు పదే పదే ప్రస్తావిస్తున్నాయి. ఇక టీడీపీలో కొందరు నేతలు కూడా.. పార్టీ భవిష్యత్తు అంతా జూనియర్ పైనే ఆధారపడి ఉందంటున్నారు. చాలామంది సీనియర్లు బయటకు చెప్పకపోయినా.. మనసులో ఇదే అభిప్రాయం ఉందన్నది పొలిటికల్ టాక్..
2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి తరువాత దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తూనే ఉంది. అప్పటి నుంచి ఎదో ఒక సందర్భంలో టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. చంద్రబాబు పర్యటనలోనూ.. స్థానిక ఎన్నికల సమయంలోనూ ఇలా చాలా సార్లు పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉందనే చర్చ జరుగుతూనే ఉంది..
ఇటీవల చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ అధినేత మీడియా సమావేశంలో వెక్కి వెక్కి ఏడ్చారు. టీడీపీ నేతలు సైతం ఇదే విషయంపై తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. నందమూరి కుటుంబసభ్యులు కూడా ఈ అంశంపై స్పందించారు. అయితే హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందన తమకు నచ్చలేదని కొందరు టీడీపీ సీనియర్ నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ ఆది లా, సింహాద్రిలా టెంపర్ చూపిస్తారు అనుకుంటే.. ప్రవచనాలు చెప్పడం చాలా బాధేసింది అన్నారు టీడీపీ నేతలు. ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. దీంతో సోషల్ మీడియా వేదికగా జూనియర్ అభిమానులు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అపాలజీ చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్టీఆర్ అభిమానులు నిరసన వ్యక్తం చేసిన విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
మరోవైపు అధికార పార్టీ వైసీపీలోనూ జూనియర్ ఎన్టీఆర్ నామస్మరణ జరుగుతూనే ఉంది. ఏపీలో టీడీపీ మళ్లీ పుంజుకోవాలంటే పార్టీ పగ్గాలను నందమూరి కుటుంబసభ్యులకు అప్పగించాలని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి గట్టిగా డిమాండ్ చేశారు. అయితే టీడీపీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్ తీసుకోవాలని బాలినేని పరోక్షంగా అదే మాట చెప్పారు..
నందమూరి కుటుంబం నుంచి ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా ఉన్నది బాలయ్య ఒక్కరు మాత్రమే. 2014, 2019 ఎన్నికల్లో హిందూపురం నుంచి బాలయ్య ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా టీడీపీ కార్యక్రమాల్లో మాత్రం బాలయ్య అంతంతమాత్రంగానే పాల్గొంటున్నారు. ఆయన ఎక్కువగా సినిమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ బాలయ్య సీఎం అవ్వాలనే డిమాండ్ ఎప్పుడూ వినిపించలేదు.. కానీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం సీఎం సీఎం అని డిమాండ్ చేస్తూనే ఉంటారు.
ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే నందమూరి కుటుంబం నుంచి బాలయ్య కాకుండా టీడీపీకి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం ఎన్టీఆర్ మాత్రమే. అతడు పార్టీకి భవిష్యత్ ఆశాకిరణం అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి నేతలు గతంలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఇప్పుడు వైసీపీ నేతలు కూడా టీడీపీని జూనియర్ ఎన్టీఆర్కే అప్పగించాలని పరోక్షంగా సూచిస్తున్నారు.
కుప్పంలో ఎన్టీఆర్ అభిమానుల నిరసనలు, ఆందోళనల వెనుక కూడా వైసీపీ నేతలే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కుప్పం టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డా. చంద్రబాబు అడ్డాలోనే టీడీపీకి వ్యతిరేక గాలి వీస్తుందని ప్రచారం చేస్తే… తమకు రాజకీయంగా ప్లస్ అవుతుందని వైసీపీ నేతలు సమాలోచనలు చేస్తున్నారని.. అందుకే ఏపీలో ఎక్కడా కనిపించని ఎన్టీఆర్ అభిమానుల హడావిడి ఇటీవల కుప్పంలో కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
గతంలో టీడీపీ గెలుపు కోసం జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా ప్రయత్నించారు. ఆ ఎన్నికల్లో విరామం లేకుండా పార్టీ తరపున ప్రచారం చేశారు. ఆయన సభలకు సైతం ఊహించని స్తాయిలో అభిమానులు వచ్చారు. అప్పుడే అభిమానుల్లో జూనియర్ ఎంత ఫాలోయింగ్ ఉంది అన్నది అర్థమైంది. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడింది. గెలిచి ఉంటే.. పరిస్థితి వేరే ఉండేది ఏమో..?
ఆ ఎన్నికల తరువాత కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన చాలా సార్లు వచ్చినా.. చంద్రబాబు వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అసలు జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీతో ఏం సంబంధం అన్నట్టే చంద్రబాబు వ్యవహరించానే ప్రచారం ఉంది. ముఖ్యంగా లోకేష్ కు జూనియర్ అడ్డంకిగా మారుతారని... ఎన్టీఆర్ ను చంద్రబాబు పక్కన పెట్టారనే విమర్శలు ఉన్నాయి.
మరోవైపు గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ కు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అవేవి పట్టించుకోకుండా ఆయన పార్టీ కోసం కష్టపడ్డారు. అయినా చంద్రబాబు పక్కన పెట్టడంతో ఆయనకు పార్టీపై ఇష్టం పోయిందనే ప్రచారం ఉంది. కాకాపోతే జూనియర్ ఎప్పుడు మాట్లాడినా.. తాత పెట్టిన పార్టీ కోసం ఎప్పుడు అవసరం ఉన్నా పని చేస్తాను అని చెబుతూనే వస్తున్నారు.
చంద్రబాబు, లోకేష్ ఎప్పుడు కుప్పంలో పర్యటించినా ఎన్టీఆర్ అభిమానులు.. ఎన్టీఆర్ సీఎం అనే ఫ్లెక్సీలతో దర్శనమిస్తున్నారని.. ఇది రాజకీయ ఎత్తుగడ అని వారు అభిప్రాయపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారన్న విషయం ఆయన అంతర్గత వ్యవహారం. ఈ విషయంలో అభిమానులు చెప్పినా.. వైసీపీ నేతలు చెప్పినా… ఎన్టీఆర్ మనసులో ఏముందన్నది అన్నదానిపై క్లారిటీ రావడం లేదు..