Srirama Navami: భద్రాద్రి రాముల వారి కల్యాణానికి సర్వం సిద్దమైంది. ఈ కల్యాణంలో ప్రధాన ఘట్టంగా భావించే తలంబ్రాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ప్రత్యేకంగా కోటి తలంబ్రాలను గోటితో వలిచి సిద్ధం చేసారు. భక్తి శ్రద్ధలతో మూడు నెలలుగా ప్రత్యేకంగా ఈ ధాన్యాన్ని గోళ్ళతో వలిచి సిద్ధం చేస్తున్నారు. గత 11 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా(East Godavari)లోని కోరుకొండ(Korukonda)కు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ఈ గోటి తలంబ్రాలను ప్రతి ఏటా తయారు చేస్తున్నారు. నాడు సీతారాముల కళ్యాణానికి శచీదేవి, అహల్యలతో పాటు, శబరి తమ గోటితో వలచిన తలంబ్రాలనే ఉపయోగించారన్న పురాణ కథనంతో ప్రేరణ పొందిన ఈ శ్రీకృష్ణచైతన్య సంఘం స్థాపకుడు కళ్యాణం అప్పారావు తానే ఈ బృహుత్కార్యానికి పూనుకున్నారు.
శ్రీ రామ క్షేత్రంలోనే గోటితలంబ్రాల పంట పండించి ఈ గోటి తలంబ్రాల విషయంలో అడుగడుగునా ప్రతి విషయంలోనూ ప్రత్యేక భక్తిశ్రద్ధలను తీసుకుంటారు. తలంబ్రాలకు ఉపయోగించే వరి నారు పోసే దగ్గరి నుంచి.. పంట కోత కోసేదాకా ప్రతి విషయాన్ని ఆధ్యాత్మికంగానే భావించి.. అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ క్రతువును నిర్వహిస్తుంటారు.
సుమారు మూడు నెలల పాటు భక్తి శ్రద్ధలతో పండించిన పంటను.. శ్రీరామనవమి రెండు నెలల ముందు నుంచే.. చుట్టు పక్కల భక్తజనాన్ని పిలిచి వారిచేత వలిపిస్తారు. దీంతో ఆ పరిసర గ్రామాల ప్రజలు ఈ కోటి గోటి తలంబ్రాల మహా యజ్ణంలో పాలుపంచుకుంటారు. ఈ కార్యక్రమానికి వడ్లు వలుపు.. శ్రీరాముని పిలుపు అనే పేరుతో పిలుస్తారు.
తలంబ్రాలు తీసుకొస్తున్నాం రామయ్య అంటూ రామచిలుకతో సందేహం గోదావరి చెంతన జరగడం అదృష్టం గా భావిస్తున్నాను అంటున్నారు నిర్వాహకులు. ఎన్నో ఏళ్లుగా భద్రాద్రి రామయ్యకు ఈ గోటి తలంబ్రాలను ఆలయంలో అప్పగిస్తున్నారు.. వీటినే శ్రీసీతారాముల కళ్యాణంలో వినియోగిస్తారు. ఇలా ఈ గోటి తలంబ్రాల కార్యక్రమంలో పాల్గొంటే శుభం జరుగుతుందన్న నమ్మకంతో ఏటా భక్తులు విరివిగా ముందుకొస్తున్నారు.