Budithi Village: దాదాపు వందేళ్లుగా జిల్లాలోని ఓ గ్రామం అందమైన కంచు, రాగి, ఇత్తడి విగ్రహాలు, పాత్రల తయారీకి పెట్టింది పేరుగా మారింది. ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు.. ప్రపంచం మొత్తం ఇక్కడి రకరకాల విగ్రహాలకు, పాత్రలకు ముగ్ధులు కావాల్సిందే. తరతరాలుగా తమ పూర్వీకుల నుంచి వస్తున్న రకరకాల పంచలోహ విగ్రహాలు, పాత్రల తయారీ వృత్తినే వారి వారసులు కూడా పుణికిపుచ్చుకున్నారు.
టంగ్ టంగ్ టంగ్ మంటూ వచ్చే శబ్ధాలు.. ఇక్కడి ఏ ఇంటిముందు కెళ్లినా వినబడతాయి. ఇత్తడి, కంచు, రాగి వంటి లోహాలతో చూడచక్కని విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. దాదాపు వందేళ్ల క్రితం ఈ చేతి వ్ళత్తిని నమ్ముకుని, కొన్ని వందల కుటుంబాలు విగ్రహాలు, పాత్రల తయారీలో ఉంటే.. మారిన పరిస్థితుల నేపధ్యంలో ప్రస్తుతం పదుల సంఖ్యలో మాత్రమే మిగిలాయి. చూడచక్కగా, ఎంతో అలవోకగా విగ్రహాలు, పాత్రలు ఇక్కడ తయారు చేస్తారు.
దేవాలయాల్లో ప్రతిష్టించే దేవీదేవతా మూర్తుల విగ్రహాలు, గంటలు, కలశాలు, చెంబులు సహా అనేక రకాల వస్తువులు, గ్ళహాలంకరణ కోసం వాడే విగ్రహాలు, తెలుగువారి ఇళ్లలో పెళ్లిళ్ల సందర్భంగా ఇచ్చే సారె సామాన్ల కోసం పలు రకాల ఇత్తడి, రాగి, కంచు పాత్రల వంటి అనేక వస్తువులను పంచలోహ మిశ్రమాలతో ఇక్కడ అలవోకగా తయారు చేస్తారు. ముఖ్యంగా సారెసామాన్లుగా ఇక్కడి బిందెలు, వంట పాత్రలు వెళ్తుంటాయి.
ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాక ఇతర దేశాలకు కూడా ఈ కళాఖండాలను పంపుతారు. బెల్జియం, స్వీడన్ వంటి దేశాలకు ఇప్పటికే అనేక ఆర్డర్లను పంపామని గర్వంగా చెబుతున్నారు ఇక్కడి కళాకారులు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు ఎగ్జిబిషన్లలో కూడా ఇక్కడి తయారైన వస్తువులను పెడతామని, పలువురి ప్రశంసలు కూడా పొందుతామని ఈ విగ్రహాల తయారీదారులు చెబుతున్నారు. దేశంలో ముంబయి, బెంగుళూరు, హైదరాబాద్, వంటి అనేక నగరాలకు కూడా వీటిని పంపిస్తామని వీరు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి, తమ పెళ్లిళ్లకు అవసరమైన ఇత్తడి, రాగి, కంచు లోహ వస్తువులను, సారె సామాన్లను పంపిస్తుంటామని గ్రామస్తులు చెబుతున్నారు. తెలుగువారు ఎక్కడున్నా.. పూజలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాలలోనూ, దేవాలయాల్లో ఇత్తడి, కంచు, రాగి వస్తువులను వాడుతారు. అలా ఎక్కడ ఏ అవసరమున్నా.. ఆర్డర్ పెడితే, వారికి ఇక్కడి వస్తువులు పంపిస్తుంటారు.
అనేక మంది విగ్రహాలు, పాత్రల వ్యాపారులు.. ఇక్కడికొచ్చి ఆర్ఢర్లు పెట్టి తమకు కావాల్సిన వస్తువులను తీసుకువెళ్తారు. కొంతమంది తమకు కావాల్సిన వస్తువుల కోసం ఫోన్ లోనే ఆర్డర్లు పెడతారని, వారికి కావాల్సినవి పంపిస్తామని వీరు చెబుతున్నారు. ఇక్కడ తయారయ్యే కొన్ని రకాల వస్తువులు మరెక్కడా తయారు చేయలేరని, దాదాపు 150 రకాల పనిముట్లను ఉపయోగించి తయారు చేసే వస్తువులు, కళాక్ళత్తులు ఎంతో ప్రాచుర్యం పొందుతున్నాయని తయారీదారులు చెబుతున్నారు.
1960, 70, 80 దశాబ్ధాల సమయంలో జరిగే పెళ్లిళ్లలో ఇచ్చే సారె సామాన్లలో వందల సంఖ్యలో ఇత్తడి, రాగి, కంచు, వెండి పాత్రలు ఇస్తే.. రానురానూ గత కొన్నేళ్లుగా పెళ్లిళ్లలో వస్తున్న మార్పులు, మారుతున్న తీరు కారణంగా ఇక్కడి వస్తువులను పెట్టడం తగ్గిపోయింది. దీంతో కొనేవారు తగ్గిపోయారు. దేశ విదేశాల నుంచి ఇప్పుడిప్పుడే ఆర్డర్లు వస్తున్నా ఈ వృత్తిని స్వీకరించే వారు లేరని వాపోతున్నారు.
ఈ వ్ళత్తిలో శ్రమ ఎక్కువ కావడం, ఆదాయం తగ్గిపోవడం కూడా అనేక మంది వలసలు పోవడానికి కారణమవుతోంది. ఇక తమ ముందు తరాల వారికి విగ్రహాల తయారీలో ఉన్నంత నైపుణ్యం, ప్రస్తుత తరం వారికి లేకపోవడం, దేవీ, దేవతా మూర్తుల విగ్రహాలు తయారు చేయాలంటే.. జ్యోతిష్య శాస్త్రం, వేదాలపైన అవగాహన ఉండాల్సిఉంది. కానీ ప్రస్తుత తరంలో అలాంటి వారు లేరని, ఇప్పుడు తయారు చేస్తున్న వారంతా.. 30,40 ఏళ్ల క్రితం వ్ళత్తిలోకి వచ్చిన వారేనని .. తయారీ దారులు చెబుతున్నారు.
మొదట డ్రాయింగ్ గీయడం, పంచలోహాల మిశ్రమాలు తయారు చేయడం, విగ్రహాలకు ఒక రూపు తేవడం, ఫినిషింగ్ చేయడం ఇలా చాలా పనులు ఉంటాయని, ఇవన్నీ చేయాలంటే ఎంతో అనుభవం ఉండాల్సి ఉంది. దీంతో ఒకవైపు విగ్రహాల తయారీ వ్ళత్తిలోకి వస్తున్న వారు రానురానూ తగ్గిపోతుంటే.. మరో వైపు గత రెండేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న కరోనాతో ఆర్డర్లు మందగించి, వస్తున్న అరకొర సంపాదనతోనే ఉన్నవారు కూడా నెట్టుకొస్తున్నారు.
కష్టాల్లో ఉన్న తమను ఇతర కళాకారుల మాదిరే పింఛన్లు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. ఉన్న కొద్ది ఆర్డర్లతో నెట్టుకొస్తున్నామని, తమ తర్వాత తరాలు కూడా ఈ వ్ళత్తిలోకి వస్తే.. తమ కళను రక్షించుకోగలుగుతామని విగ్రహాల తయారీ దారులు చెబుతున్నారు. "వివిధ రకాల విగ్రహాలు, వస్తువుల తయారీలో ఉన్న పాత కళాకారుల్ని బతికించుకోవాలంటే ప్రభుత్వం వారిని ఆదుకోవాలని, వారి వద్ద కొత్త వారికి శిక్షణ ఇప్పించగలిగితే కళ బతుకుందని, తద్వారా.. వారికి చేయూత అవుతుందని గ్రామస్తులు చెబుతున్నారు.