ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వైద్య శాఖలో కొత్త ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఐదు మెడికల్ కాలేజీల నిర్వహణకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో 3,530 పోస్టులను ప్రభుత్వం సృష్టించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు ఇచ్చారు. (ప్రతీకాత్మకచిత్రం)
ఒక్కో మెడికల్ కాలేజీకి 706 పోస్టులు చొప్పున మొత్తం 3,530 పోస్టులు సృష్టించేందుకు ఇటీవలల కేబినెట్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మకచిత్రం)
ఇందులో భాగంగా జాతీయ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) నిబంధనల ప్రకారం వైద్య కళాశాలలో 222, అనుబంధంగా ఉండే బోధనాస్పత్రిలో 484 చొప్పున పోస్టులను ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెస్తోంది. ప్రతి మెడికల్ కాలేజీ, బోధానాస్పత్రిలో ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ పోస్టులతో పాటు, 11 ప్రొఫెసర్లు, 25 అసోసియేట్ ప్రొఫెసర్లు, 42 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 58 సీనియర్ రెసిడెంట్, 18 హెడ్ నర్సు, 200 స్టాఫ్ నర్స్, ఇతర పారామెడికల్, నాన్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్ పోస్టులున్నాయి. (ప్రతీకాత్మకచిత్రం)
ఐదు వైద్య కళాశాలల ఏర్పాటులో భాగంగా అక్కడి జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా వైద్య శాఖ అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో ప్రతి ఆస్పత్రిలో ఒక లక్ష చ.అ. ప్రీ-ఇంజినీర్డ్ బిల్డింగ్ (పీఈబీ) నిర్మాణానికి ప్రభుత్వం రూ.146 కోట్లు ఖర్చు చేస్తోంది. అదే విధంగా ఒక్కో ఆస్పత్రిలో రూ.5 కోట్ల చొప్పున రూ.25 కోట్లు ఖర్చు చేసి వైద్య సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. (AP Cabinet File)