Corona Tension in Visakhapatnam: విశాఖ జిల్లాను కరోనా కేసులు భయపెడుతున్నాయి. తాజా పరిస్థితి చూస్తే.. రాబోయే రోజుల్లో వైరస్ మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది.. ఇప్పటికే పాజిటివిటీ రేటు 20 శాతానికి చేరువ అయ్యింది. గత మూడు, నాలుగు రోజులుగా నిత్యం వేయికిపైగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రెండు మూడు రోజుల్లో కేవలం విశాఖ జిల్లాల్లోనే రెండు వేలకు పైగా కేసులు నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.
నిత్యం సందర్శకులతో కిటకిటలాడే ప్రభుత్వ కార్యాలయాలను సైతం కొవిడ్ సోకింది. ఇప్పటికే కొన్ని కార్యాలయాల్లో అధికారుల నుంచి సిబ్బంది వరకు పలువురు కరోనా బారిన పడ్డారు. చిన్నపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తుండడంతో కొందరు తేలికగా తీసుకుంటుండగా, పరీక్షలు చేయించుకుని, పాజటివ్ వచ్చిన వారు విధులకు సెలవు పెడుతున్నారు.
ముఖ్యంగా సంక్రాంతి పేరుతో షాపింగ్, సొంత ఊళ్లకు వెళ్లి రావడంతో పలువురికి కరోనా సోకే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారిపై ఆంక్షలు విధించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో కొవిడ్ టెన్షన్ భయపెడుతోంది. గ్రామీణ ప్రాంత కార్యాలయాల్లో పనిచేసి సిబ్బందిలో పలువురికి ఇప్పటికే కరోనా సోకింది.
చోడవరం ఆస్పత్రిలో నలుగురికి పాజిటివ్ రావడంతో వైద్యం కోసం వెళ్లేందుకు రోగులు వెనుకంజవేస్తున్నారు. కలెక్టరేట్లో పలువురు సిబ్బందికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో మిగిలిన వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. కలెక్టర్ పేషీలోని సిబ్బందిలో ఒకరికి కరోనా సోకడంతో అప్రమత్తమయ్యారు. చివరకు కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున కూడా బంగ్లా నుంచి విధులు నిర్వహిస్తున్నారు. దీంతో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు ప్రకటించారు.
తాజా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. సంక్రాంతి సెలవుల తరువాత సోమవారం నుంచి విద్యాసంస్థలు ప్రారంభమైనా.. 80 శాతానికి పైగా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపించలేదు.. ఓ వైపు పండగకు వెళ్లి చాలామంది తిరిగి రాకపోగా.. కొంతమంది. అంతా ఊళ్ల నుంచి తిరిగి వస్తారు. ఇలాంటి స్కూల్ కు పంపిస్తే.. కరోనా ప్రమాదం ఉందని భయపడుతున్నారు.
పాఠశాలలు, కళాశాలలకు పంపకపోతే తరగతులు మిస్ అవుతారని, పంపితే కరోనా సోకుతుందేమోననే భయంలో వారిలో నెలకొంది. కాగా తెలంగాణలో విద్యాసంస్థలకు నెలాఖరు వరకు సెలవులు ప్రకటించినా, మన రాష్ట్రంలో సెలవులిచ్చేది లేదని విద్యాశాఖా మంత్రి సురేష్ ఆదివారం గుంటూరులో స్పష్టం చేయడంతో టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. మరోవైపు రేపటి నుంచి స్కూళ్లకు సెలవలు ప్రకటిస్తారనే ప్రచారం కూడా ఉంది.
తాజాగా అంటే గత 24 గంటల్లో విశాకలో మరో 1028 మందికి కొవిడ్ సోకింది. ఆదివారం 19.45 శాతం పాజిటివిటీతో 1,028 మందికి కరోనా సోకింది. వీరిలో 18 మంది ఆస్పత్రిలో చేరగా, మిగిలిన వారంతా హోం ఐసోలేషన్లో ఉన్నారు. వీటితో ఇప్పటి వరకు జిల్లాలో 1,65,425 మందికి కరోనా బారిన పడ్డారు. చికిత్స పొందుతూ ఆదివారం 101 మంది డిశ్చార్జ్ అయ్యారు.