AP Corona Tension: ఆంధ్రప్రదేశ్ ను కరోనా కేసులు భయపెడుతున్నాయి. ఇప్పటికే 24 గంటల్లో నమోదవుతున్న వాటిలో 5 వేల మార్క్ కు కేసులు చేరువ కావడం ఆందోళన పెంచుతోంది. ముఖ్యంగా రెండు జిల్లాల్లో రోజూ వేయి మందికిపైగా కరోనా బారిన పడుతున్నారు. సంక్రాంతి తరువాత ఈ కేసుల సంఖ్య రెట్టింపు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇప్పటికే కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గతంలో సెకెండ్ వేవ్ లో కరోనా కేసులు ఊహించని స్థాయిలో పెరగడంతో కట్టడి కోసం ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేసింది. కఠిన కర్ఫ్యూ విధించింది. దీంతో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అయితే తరువాత ప్రజల్లో నిర్లక్ష్యం పెరగడానికి తోడు.. కొత్త వేరియంట్ కారణంగా పరిస్థితి మొదటికి వస్తోంది.
గడిచిన 24 గంటల్లో 35,673 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 4,955 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్నటితో పొలిస్తే కేసుల సంఖ్య నాలుగు వందలకుపైగా పెరిగాయి. జనవరి మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల లోపు కేసులు ఉండేవి.. కానీ ఇప్పుడు ఐదే వేల మార్కుకు చేరువ అవ్వడం ఆందోళన పెంచుతోంది.
తాజాగా నమోదు అవుతున్న కేసులు అధికారులను కలవరానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికే కేసుల వేగంగా నమోదు అవుతున్నాయి. సంక్రాంతి తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికి భయమేస్తోంది అంటున్నారు. ఎందుకంటే సంక్రాంతి సంబరాల పేరుతో భారీగా జనం గుమిగూడుతున్నారు. అందులో ఒకరిద్దరికి పాజిటివ్ ఉన్నా.. ప్రమాదం పొంచి ఉన్నట్టే..
సంక్రాంతి పండుగ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూను.. ఈ నెల 18 నుంచి అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇదీ కూడా కేసులు పెరగడానికి ఓ కారణం అయ్యే ప్రమాదం ఉంది. సంక్రాంతి వేడుక పేరుతో గ్రామాలకు చేరుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇందులో చాలామంది కరోనా నిబంధనలు పాటించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఏపీ వ్యాప్తంగా ఈ నెల 18 నుంచి కఠినంగా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నా.. ఆ రెండు జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణం ఉంది కాబట్టి కఠిన ఆంక్షలు అమలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే విశాఖ, చిత్తూరు జిల్లాల్లో వేయికిపైగా కేసులు నమోదు అవుతుండడంతో వీకెండ్ కర్ఫ్యూ లేదా.. సాయంత్రం నుంచి కర్ఫ్యూ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.