AP CM Jagan on Visakhapatnam: : ఏపీని పరిపాలనా రాజధానిగా చేయాలనే సంకల్పంతో ఉన్నారు సీఎం జగన్. ఇటీవల మూడు రాజధానుల బిల్లును వెనక్కు తీసుకున్నా.. మరోసారిర బిల్లును ప్రవేశ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేయాలన్నది ఆయన సంకల్పం. ఆ దిశగా మరో అడుగు వేసే ప్రయత్నం చేస్తున్నారు. తన మనసులో మాటను సినిమా పెద్దల ముందు బయటపెట్టారు.
తాజాగా సినిమా హీరోలు, దర్శకులు, నిర్మాతలతో భేటీ అయిన ఆయన.. సినీ పరిశ్రమ విశాఖకు కూడా రావాలని కోరారు. అందరికీ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తామని చెప్పారు. తెలంగాణతో పోలిస్తే సినీ పరిశ్రమకు ఆంధ్రా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తోందన్నారు. ఏపీలో జనాభా, థిటయేటర్లు ఎక్కువ..ఆదాయం కూడా ఎక్కువేనని తెలిపారు. స్టూడియోలు పెట్టేందుకు ఆసక్తి చూపితే విశాఖలో స్థలాలు ఇస్తామని చెప్పారు. జూబ్లిహిల్స్ తరహా ప్రాంతాన్ని క్రియేట్ చేద్దామని చెప్పారు. చెన్నై, బెంగళూరు, లో విశాఖ పోటీ పడగలదన్నారు.
మనం ఓన్ చేసుకోవాలి, మనందరం అక్కడకి వెళ్లాలి… అప్పుడే విశాఖపట్నం, ఇవాళ కాకపోయినా పదేళ్లకో, పదిహేనేళ్లకో.. మహానగరాలతో పోటీపడుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. దీనికి ముందడుగు పడాలంటే.. సినిమా పరిశ్రమ విశాఖ వెళ్లేందుకు అడుగులు పడాలని కోరారు. అందరూ దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. అందరికీ స్థలాలు ఇస్తా… ఇళ్లస్థలాలతోపాటు, స్టూడియో స్థలాలు కూడా ఇస్తానని నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను అని జగన్ సినిమా స్టార్ లను కోరారు..
తెలుగు సినిమా ప్రముఖులతో క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ భేటీ అయ్యారు. సినీ ప్రముఖులు చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, అలీ, ఆర్.నారాయణమూర్తి, పోసాని కృష్ణమురళి, కొరటాల శివ, నిరంజన్ రెడ్డి తదితరులతో సమావేశమైన సీఎం.. తరువాత మాట్లాడుతూ మంచి పాలసీ తీసుకురావాలని, తద్వారా పెద్ద సినిమాలకు, చిన్న సినిమాలకు న్యాయం జరగాలని గత కొద్ది కాలంగా కసరత్తు జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే అందరి అభ్యర్ధనలను పరిగణలోకి తీసుకుంటూ… దీనిపై ఒక కమిటీని కూడా నియమించామని పేర్కొన్నారు. ఆ కమిటీ కూడా తరచూ సమావేశమవుతూ వాళ్లకొచ్చిన ఫీడ్ బ్యాక్ కూడా తనతో పంచుకున్నారని తెలిపారు.
ఇంకా విస్తృతంగా తెలుసుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులను రమ్మని చెప్పాను అన్నారు సీఎం జగన్. సినిమా పరిశ్రమలో ఉన్న కొన్ని కొన్ని లోపాలను పూర్తిగా సరిదిద్దుకుని.. ఇండస్ట్రీ నిలబడ్డానికి ఒక మంచి వ్యవస్ధను క్రియేట్ చేసుకునేందుకు తపన, తాపత్రయంతోనే అడుగులు పడ్డాయని పేర్కొన్నారు. ప్రాథమికంగా ఒక ప్రాతిపదిక లేనంతవరకు …కొద్దిమందికి ఎక్కువ వసూలు చేయడం, కొద్దిమందికి తక్కువ వసూలు చేయడం అనేది ఉంటుందన్నారు. తాను, చిరంజీవి అన్న ఇద్దరం కలిసి కూర్చుని దీనిపై చాలాసేపు విస్తృతంగా చర్చించామని తెలిపారు. మంచి ధరలు తీసుకురావడం జరిగిందని, ఇవి ఎవరికైనా కూడా మంచి రేట్లే… అందరికీ న్యాయం జరిగేలా మంచి ధరలు తీసుకొచ్చే ప్రయత్నం చేశామని చెప్పారు.
హీరో పారితోషకం, హీరోయిన్ పారితోషకం, దర్శకుడు పారితోషం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే నిర్మాణవ్యయం పరంగా కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ తరహా సినిమాలు చేయడంలో రాజమౌళి నిపుణుడు అని అభిప్రాయపడ్డారు. అలాంటి వాటిని ప్రత్యేకంగా చూడాలన్నారు. అలా ప్రత్యేకంగా చూడకపోతే భారీ టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఖర్చుతో చేయడానికి ఎవరూ ముందుకురారని తెలిపారు. హీరో, హీరోయిన్, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా, వీటిని పక్కన పెట్టి కేవలం సినిమా కోసమే రూ.100 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అయిన భారీ బడ్జెట్ సినిమాలును ప్రత్యేకంగా ట్రీట్ చేయాలన్నారు. అలాంటి వాటికి వారం రోజుల పాటు కచ్చితంగా ప్రత్యేక ధరలు నోటిఫై చేసే విధంగా ట్రీట్ చేయాలని చెప్పామని తెలిపారు.
అలాగే రాష్ట్రంలో కూడా షూటింగ్‌లు ప్రమోట్ చేయడం కోసం కొంత పర్సెంటేజ్ కేటాయించామని చెప్పారు. ఏపీలో సినిమా షూటింగ్‌లు ప్రమోట్ చేయడం కోసం… ఇక్కడ షూటింగ్‌లు జరిపి ఉండాలి అన్న నిబంధనను తీసుకురాగలిగితే ఇక్కడ కూడా షూటింగ్‌లు పెరుగుతాయని అన్నారు. కనీసం ఎంత శాతం షూటింగ్ ఆంధ్రప్రదేశ్‌లో చేయాలన్న దానిపై ఇప్పటికే మంత్రి దర్శకులు, నిర్మాతలతో మాట్లాడరు. వారందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని తనతో కనీసం 20 శాతం పెడతాము అని చెప్పారని పేర్కొన్నారు.
టాలీవుడ్ కోరినట్టు ఐదో షోను కూడా తీసుకురావాలని అడిగారని.. సినిమా శుక్రవారం, శనివారం, ఆదివారం.. ఆ తర్వాత వారం ఆడగలిగితే సూపర్‌హిట్ అవుతుందన్నారు. ఆ పాయింట్ అర్థం చేసుకున్నామని, అదే సమయంలో అది అందరికీ వర్తిస్తుందన్నారు. చిన్న సినిమాలకు అవే రేట్లు వర్తిస్తాయని, వారిక్కూడా మంచి ఆదాయాలు వస్తాయని తెలిపారు. ఐదో ఆట వల్ల ఇండస్ట్రీకి కూడా మేలు జరుగుతుంది.. మల్టీప్లెక్స్‌లును కూడా మంచి ధరలతో ట్రీట్ చేయడం జరుగుతుందన్నారు. మీరు చెప్పిన అన్ని విషయాలను మనసులో పెట్టుకున్నానని.. మీ అందరికీ సంతోషం కలిగించినందుకు ఆనందంగా ఉందన్నారు.
రాజమౌళి మంచి సినిమాలు, పెద్ద సినిమాలు తీయాలని కోరారు. చిన్న సినిమాలను కూడా రక్షించుకోవాలని.. దీనికోసం కార్యాచరణ చేసుకోవాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. సినిమా క్లిక్ కావాలంటే పండగ రోజు రిలీజ్ చేస్తే హిట్ అవుతుందని అందరికీ తెలుసు. ఇక్కడే చిన్నసినిమాను రక్షించుకోవడానికి కూడా కొంత సమతుల్యత అవసరం అన్నారు. పరిశ్రమ నుంచే దీనికి తగిన కార్యాచరణ ఉండాలని కోరుతున్నామని తెలిపారు. ఆ పండగ రోజు తమకు అవకాశాలు లేవని చిన్నసినిమా వాళ్లు అనుకోకుండా… కాస్త సమతుల్యత పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కలిసి పనిచేద్దాం.. వాళ్లు కూడా పరిశ్రమలో భాగమే, వాళ్లనూ భాగస్వామ్యులు చేయాలని అభిప్రాయపడ్డారు.