ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఫలితాలిస్తోంది. మద్యం, ఇసుక, గుట్కా అక్రమ రవాణా, అవినీతిపై సీఎం ఏర్పాటు చేసిన SEB తొమ్మిది నెలల్లో దాదాపు లక్ష కేసులు నమోదు చేసింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పనితీరుపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
సీఎం జగన్ మాట్లాడుతూ మద్యం, ఇసుకలో ఎక్కడా అక్రమాలకు అస్కారం ఉండకూడదని.. అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపాల్సిందేనని అధికారులకు స్పష్టం చేశారు. అక్రమాలతో ప్రభుత్వ ఆదాయాలకు గండికొట్టేవారిని ఉపేక్షించవద్దన్న సీఎం.. వ్యవస్థీకృతంగా కూడా అవినీతికి ఆస్కారం ఉండకూడదన్నారు. ఎక్కడైనా తప్పులు జరిగాయన్న సమాచారం రాగానే కచ్చితంగా దానిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.