Save Amaravati: ఒకవైపు రాష్ట్రాన్ని ముంచెతుతున్న వానలు.. మరోవైపు అడుగడుగునా ఆంక్షలు.. ఈ రెండింటి మధ్యే మహా సంకల్పంతో అమరావతి రాజధాని రైతులు మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అ మరావతిపై అధికార పార్టీ పెద్దల చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, రాజధాని ఆవశ్యకతను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు అ 2.0 పాదయాత్రకు శ్రీకారం చుట్టారు..
తొలి రోజు ఇలా..
వెంకటపాలెంలో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయంలో వేకువజామున 5 గంటలకు పూజలు చేశారు. ఉదయం 6.03 గంటలకు ఆలయం వెలుపల ఉన్న శ్రీవారి రథాన్ని నడిపి పాదయాత్రకు అంకురార్పణ చేశారు. తర్వాత రథాన్ని వెంకటపాలెం గ్రామంలోకి తీసుకెళ్తారు. 9 గంటలకు జెండా ఊపి యాత్రను లాంఛనంగా ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి యాత్ర కృష్ణాయపాలెం, యర్రబాలెం మీదుగా సాయంత్రానికి మంగళగిరి చేరుకుంటుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు. మొదటి రోజు దాదాపు 15 కిలోమీటర్ల మేర నడవనున్నారు.
వైసీపీ మినహా అన్ని పార్టీల మద్దతు
పాదయాత్రలో పాల్గొని ఉద్యమానికి మద్దతివ్వాలని అమరావతి పరిరక్షణ సమితి, రైతు ఐకాసల నేతలు ఇప్పటికే అధికార వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలసి ఆహ్వానించారు. అన్ని పార్టీల నేతలు పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్నారు. టీడీపీ నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు రానున్నారు.
బీజేపీ తరుపున మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, పార్టీ నాయకులు సత్యకుమార్, వల్లూరి జయప్రకాశ్.. కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, శైలజానాథ్, తులసిరెడ్డి హాజరవుతారు. జనసేన పార్టీ నుంచి పోతిన మహేష్, శ్రీనివాస్ యాదవ్.. సీపీఎం తరఫున శ్రీనివాసరావు, చిగురుపాటి బాబూరావు.. సీపీఐ నుంచి నారాయణ, రామకృష్ణ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు.
ఇబ్బందులు తలెత్తకుండా..
ఈ దఫా పాదయాత్రలో గతం కంటే రెట్టింపు మంది పాల్గొంటున్నందున భోజన, రాత్రి బస ఏర్పాట్లకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మార్గమధ్యలో ఎక్కడెక్కడ బస, విడిది చేయాలనేది ఇప్పటికే ఐక్యకారచరణ కమిటీ నేతలు ఖరారు చేశారు. ఇబ్బందులు ఎదురయ్యే పక్షంలో ప్రత్యామ్నాయ స్థలాన్నీ ఎంపిక చేశారు. దాదాపు 600 మందికి అన్ని చోట్లా అల్పాహార, భోజనాలకు ప్రణాళిక రూపొందించారు.
మహా పాదయాత్రకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని.. దాదాపు 50 మందిని వీటిలో సభ్యులుగా నియమించారు. పాదయాత్రలో పాల్గొనేందుకు అన్ని జిల్లాలకు చెందిన ప్రముఖులను కలసి ఆహ్వానించారు. నిర్దేశిత ప్రాంతాల్లో పాదయాత్రల్లో పాల్గొన్న వారికి సమయానికి అల్పాహారం, భోజనాలు అందేలా ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. యాత్రలో పాల్గొనేవారికి అర కిలోమీటరుకు ఒకసారి తాగునీరు అందించేందుకు వాటర్ కమిటీని ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలనేది జనసేన విధానమని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రైతు ఉద్యమానికి జనసేన సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఆయన ప్రకటించారు. పాదయత్ర కొనసాగే అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులకు సంఘీభావం తెలియచేస్తూ వారికి స్వాగతం పలుకుతారన్నారు. ఒక పక్క న్యాయస్థానాలు చెబుతున్నా వినకుండా మళ్లీ మూడు రాజధానుల పాట పాడడం వెనక రాజకీయ కుట్ర దాగి ఉందన్నారు. రాజు మారినప్పుడల్లా రాజధాని మారదన్నారు.
ఆకట్టుకునేలా రథం ఆకృతి
మరోవైపు రెండో విడత పాదయాత్రకు సిద్ధం చేసిన శ్రీవారి రథం ఆకృతిని గతం కంటే మార్చారు. ఈసారి యాత్ర శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యభగవానుడి ఆలయం వరకు సాగుతుండడంతో సూర్యుడి రథం ఆకృతిని తీసుకుని ప్రత్యేకంగా తయారు చేశారు. రథాన్ని ఏడుగుర్రాలు లాగుతున్నట్లు తీర్చిదిద్దారు. ఇందులో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడి విగ్రహాలను ఉంచారు.