మీరు డబ్బులు దాచుకోవాలని భావిస్తున్నారా? అయితే చాలా ఆప్షన్లు మీకు అందుబాటులో ఉన్నాయి. రిస్క్ తీసుకునే వారు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ వంటి వాటిల్లో డబ్బులు పెట్టొచ్చు. రిస్క్ వద్దనుకునే వారు బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవచ్చు. సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కోసం చూసే వారు స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు.
మార్కెట్లో ప్రభుత్వం చాలా సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలు అందిస్తోంది. ఇప్పుడు మనం అధిక వడ్డీ రేటు అందించే టాప్ 5 పొదుపు పథకాలు ఏవో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
ముందుగా సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) గురించి మాట్లాడుకోవాలా. ఈ స్కీమ్‌లో చేరితే 8 శాతం వడ్డీ వస్తుంది. 60 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. ఈ టెన్యూర్ అయిపోయిన తర్వాత మరో మూడేళ్లు మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించుకోవచ్చు. ఈ స్కీమ్‌లో గరిష్టంగా రూ. 30 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు.
సుకన్య సమృద్ధి స్కీమ్‌పై కూడా అధిక వడ్డీ వస్తోంది. ఈ స్కీమ్‌లో చేరితే 7.6 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. పదేళ్లలోపు వయసు కలిగిన ఆడ పిల్లల పేరుపై ఈ సుకన్య సమృద్ధి ఖాతాను తెరవొచ్చు. బ్యాంకులు లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి ఈ స్కీమ్‌లో చేరొచ్చు. గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్కీమ్‌పై రూ. 1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా 15 ఏళ్ల వరకు డబ్బులు కట్టాల్సి ఉంటుంది. స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు.
కిసాన్ వికాస్ పత్ర పథకం కూడా ఉంది. ఇందులో చేరితే 7.2 శాతం వడ్డీ వస్తుంది. పోస్టాఫీస్‌కు వెళ్లి ఈ స్కీమ్‌లో చేరొచ్చు. దీర్ఘకాలం వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావించే వారికి ఇది మంచి స్కీమ్ అని చెప్పుకోవచ్చు. మీ డబ్బులను రెట్టింపు చేసే పథకం ఇది.
ఇంకా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) స్కీమ్ కూడా ఉంది. మోస్ట్ పాపులర్ స్కీమ్స్‌లో ఇది కూడా ఒకటి. పన్ను మినహాయింపు, రాబడి వంటివి కోరుకునే వారు ఈ స్కీమ్‌లో చేరుతారు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. తర్వాత ఐదేళ్ల చొప్పున టెన్యూర్ పొడిగించుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ స్కీమ్‌పై 7.1 శాతం వడ్డీ వస్తుంది.
అలాగే నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) పథకం ఉంది. దీనిపై అయితే 7 శాతం వడ్డీ వస్తోంది. దీన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ స్కీమ్‌గా కూడా చెప్పుకుంటారు. మీరు పోస్టాఫీస్‌కు వెళ్లి ఈ స్కీమ్‌లో చేరొచ్చు.