YCP vs Pawan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల హీట్ కంటిన్యూ అవుతోంది. మొన్నటి వరకు ట్రయాంగిల్ పోటీ ఉంటుందా.. లేక కూటమి వర్సెస్ వైసీపీ (YCP) గా పోటీ ఉంటుందా అనే ఆసక్తి ఉండేది. అయితే పొత్తులపై ఎవరూ అధికారికంగా ప్రకటన చేయకపోయినా.. దాదాపు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కలిసే వెళ్తారని అధికార వైసీపీ ఫిక్స్ అయ్యింది. విశాఖ ఘటన తరువాత పవన్ వ్యాఖ్యలు, చంద్రబాబు సమావేశం అవ్వడంతో.. ఆ కూటమి జత కట్టడం ఖాయమంటూ జోస్యం చెబుతున్నారు. ఇప్పుడు అందరి టార్గెట్ పవన్ అవుతున్నారు. మంత్రులు.. వైసీపీ సీనియర్ నేతలు ను ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy) స్పందించారు. పవన్, చంద్రబాబులపై తీవ్ర విమర్శలు చేశారు.
చంద్రబాబు ఓ కృత్రిమ ఉద్యమం నడిపిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. వైజాగ్ నుండి పరిపాలన చేస్తామని, కోర్టు ఆదేశాల మేరకు పరిపాలన ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా విశాఖపట్టణం నుండి ప్రారంభిస్తామని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకటేనని తాము ఎప్పటినుంచో చెబుతున్నామని, రహస్యంగా ఉన్న వాళ్ళే ఇప్పుడు బయట కొచ్చారన్నారు.
గత ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్ వైపు రాకూడదనే వారు విడివిడిగా పోటీ చేశారన్నారు. ప్రస్తుతం ఎన్నికల దగ్గరలో లేవని, అయితే తొందరలో ఎన్నికలు వస్తున్నాయంటూ చంద్రబాబు చెబుతున్నారని అన్నారు. నటుడు వల్ల ఓట్లు వస్తాయని అనుకుంటున్నారని, పవన్ ఉంటే నాయకులు నిలబడతారనే భ్రమలో ఉంచుతున్నారని అన్నారు. బీజేపీ నుండి కమ్యూనిస్టు ల వరకూ అందరిని కలిపి జగన్ ను అధికారంలో నుండి దించాలనే చంద్రబాబు నాయుడు చూస్తున్నారంటూ విమర్శించారు.
ఇదీ చదవండి : జనసేనకు భారీ ఊరట.. విశాఖ ఘటనలో అరెస్టైన నేతలకు బెయిల్.. న్యాయమే నెగ్గిందన్న పవన్
టీడీపీ , జనసేన ముసుగు తొలగిపోయిందన్నారు. ప్రజల్లో లేని నాయకుడు అధికారంలోకి రావాలని చూస్తున్నారని చంద్రబాబునాయుడును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులను తాము ఎన్నికల్లో గెలిపించే ఎజెండా గా చూడటం లేదని, ఆచరణ సాధ్యం కాని అమరావతి నిర్మాణంతో అధిక నిధులు ఖర్చు పెట్టలేక సమగ్రాభివృద్ధి కోసమే 3 రాజధానులు అంటున్నామన్నారు. రియల్ ఎస్టేట్ ద్వారా వేల కోట్లు సంపాదించాలనుకున్న చంద్రబాబు నాయుడు, వారి బినామీల ఆలోచన సాధ్యం కాలేదన్నారు.
ఇదీ చదవండి : సీఎం నివాసం సమీపంలో లోకేష్ అద్భుత కార్యక్రమం.. సొంత ఖర్చులతో సంజీవని ఆరోగ్య రథం
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం పవన్, చంద్రబాబు పై తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి రాకముందే తాను ఎస్వీయూ అధ్యక్షుడిగా ఉన్నానని తెలిపారు. ఏ రోజు కూడా వాడు, వీడు అని ఎవరిని మాట్లాడలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు ఆయన దత్తత పుత్రుడు పవన్ కల్యాణ్ తప్పుడు కూతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ ఉపయోగించిన భాష చాలా దారుణమని.. తెలుగు రాష్ట్రాలు సిగ్గుపడేలా ఆయన వ్యాఖ్యానించారని మండిపడ్డారు. మనం మాట్లాడే భాష మంచిగా ఉండాలని హితవు పలికారు.
రాష్ట్రంలో చెప్పులు చూపించే సంస్కృతి మనకు ఉందా అని మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. మూడు పెళ్లిళ్లు చేసుకోమంటున్న పవన్ గురించి రాష్ట్ర మహిళలే ఆలోచిస్తారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు, పవన్ హైదరాబాద్‌కే పరిమితమవుతారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణ నాయకుడని, ఆయన్ను ఎదురించాలంటే చంద్రబాబుకు ధైర్యం, బలం సరిపోదన్నారు. ‘పులి ఒక్కటే వేటకు పోతుంది కానీ.. గుంపులు గుంపులుగా.. మందలు మందలుగా పోదు. ఏపీలో ఎన్ని మందలు వచ్చినా.. ప్రజల అభిమానంతో 2024ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధించడం ఖాయమన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Peddireddy Ramachandra Reddy, Sajjala ramakrishna reddy