తెలంగాణలోని మిగతా జిల్లాల రాజకీయాల కంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు భిన్నంగా సాగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్‌ను వీడేందుకు సిద్ధమైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy).. ఏ పార్టీలో చేరే విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. ఆయన మొదట్లో బీజేపీలో చేరతారని అంతా భావించారు. కానీ ఆయన బీజేపీ వైపు వెళ్లలేదు. ఆ తరువాత వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను(YS Sharmila) కలిశారు. వైఎస్ఆర్‌టీపీలోకి వెళుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. షర్మిల సైతం తమ పార్టీలోకి రాబోతున్నారని పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఆ తరువాత పొంగులేటి విజయమ్మను కూడా కలవడంతో.. ఆయన వైఎస్ఆర్‌టీపీలోకి వెళ్లడం దాదాపుగా ఖాయమైందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అందుకు తగ్గట్టుగానే పొంగులేటి రాజకీయ అడుగులు కూడా ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ సమావేశాలు పెడుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. వచ్చే ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయబోయేది ఎవరో చెబుతున్నారు. తాను చేరబోయే పార్టీ ద్వారానే వీరంతా ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని ప్రకటిస్తున్నారు. పొంగులేటి ప్రకటనలు చూస్తుంటే.. ఆయన చెప్పినట్టుగా అభ్యర్థులకు టికెట్లు ఇచ్చే పార్టీ.. వైఎస్ఆర్‌టీపీలోకి ఒక్కటే అనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.
గతంలో వైసీపీ తరపున పోటీ చేసిన ఎంపీగా గెలిచిన పొంగులేటి.. తన వర్గానికి చెందిన పలువురిని ఎమ్మెల్యేలుగా కూడా గెలిపించుకోవడంలో సక్సెస్ అయ్యారు. మరోసారి అదే రకమైన వ్యూహంతో ఆయన ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తనతో పాటు తన వర్గం ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే.. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. తన మాట చెల్లుబాటు అవుతుందనే వ్యూహంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందుకు సాగుతున్నారనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో జరుగుతోంది.
Bhatti Vikramarka: సీబీఐ చేతికి ఎమ్మెల్యేల ఎర కేసు..స్పందించిన భట్టి విక్రమార్క..ఏమన్నారంటే?
Telangana: మజ్లిస్ ముఖ్యనేతతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల చర్చ.. అసెంబ్లీలో కీలక పరిణామం
అందుకే బీఆర్ఎస్‌ను వీడేందుకు సిద్ధమైన తరువాత కాంగ్రెస్, బీజేపీలకు భిన్నంగా వైఎస్ఆర్‌టీపీను ఎంచుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రధాన పార్టీల్లో చేరితే.. గెలిచిన అభ్యర్థులు పార్టీ కారణంగానే గెలిచారని అంటారని.. అదే వైఎస్ఆర్‌టీపీ తరపున బరిలోకి దిగి తన అనుచరులను గెలిపించుకుంటే.. ఆ క్రెడిట్ అంతా తనకే దక్కుతుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.