త్వరలోనే మహారాష్ట్రలో బీఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్ఎస్ సభ ముగిసిన తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము మహారాష్ట్రకు నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. నదుల అనుసంధానంపై ఏకంగా పుస్తకాలే వచ్చాయని.. కానీ వాటిని పాలకులే అనుసరించడం లేదని కేంద్రానికి చురకలంటించారు కేసీఆర్. బాబ్లీ ప్రాజెక్టు పేరుతో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర ప్రజలతో డ్రామా ఆడారని.. అసలు బాబ్లీ ప్రాజెక్టు విషయంలో వివాదమే లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక ఇక వివాదం ఎక్కడిదంటూ కేసీఆర్ ప్రశ్నించారు.
దేశంలో అలాంటి ప్రాజెక్టు ఒక్కటీ లేదు:
చైనా, రష్యా , ఈజిప్టు లాంటి దేశాల్లో వేల టీఎంసీల కెపాసిటీతో సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయని..కానీ దేశంలో అలాంటి ప్రాజెక్టు ఒక్కటీ లేదన్నారు కేసీఆర్ . కేంద్రంలో అధికారంకి వచ్చేందుకు గతంలో అనేక పార్టీలు అబద్దాలతో ప్రజలను మోసం చేశాయని మండిపడ్డారు. దేశంలో వాటర్ పాలసీలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో అధికారంలోకి వస్తే వాటర్ పాలసీలో మార్పులు తెస్తామని...అదే బీఆర్ఎస్ పార్టీ నినాదమని చెప్పారు. దేశంలో సాగునీరు లేక ఇప్పటికీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే నానా పాటేకర్ లాంటి సినిమా స్టార్లు సహాయం చేశారని గుర్తు చేశారు. సాగునీరు, కరెంట్ అందక పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేంద్రం తమాషా చూసినట్లు చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పవర్ పాలసీ, వాటర్ పాలనీ, ఇరిగేషన్ పాలసీలను మారుస్తామన్నారు. నాలుగు దశాబ్దాలు దాటినా ట్రైబ్యునళ్లు దేశంలోని జలవివాదాలను ఎందుకు పరిష్కరించడంలేదు? దేశంలో ఎందుకు జల యుద్ధాలు జరుగుతున్నాయి? మహానది, గోదావరి, కావేరి నీళ్ల కోసం పంచాయితీలు ఎందుకు? రాష్ట్రాల మధ్య ఎందుకు నీటి చిచ్చు పెడుతున్నారు? అని ప్రశ్నించారు కేసీఆర్.
జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిపించండి: కేసీఆర్
జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించాలని మరఠా ప్రజలను కోరారు సీఎం కేసీఆర్. కేవలం ఒక్క బటన్ నొక్కండి.. దేశమంతా మారిపోతోందంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో అనేక సమస్యలు ఉన్నాయని.. అవన్నీ పరిష్కారం కావాలన్నారు కేసీఆర్. తన మాటల్లో నిజం ఉందని.. గులాబీ జెండా భుజాన వేసుకుని కదలిరండి అంటూ కేసీఆర్ పిలుపునిచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR