ఈ ఏడాదికి సంబంధించిన నోబెల్ బహమతుల (Noble Prize) ప్రకటనల పర్వం ప్రారంభమైంది. వైద్య శాస్త్రంలో 2021 (Physiology or Medicine 2021) సంవత్సరానికి నోబెల్ పురస్కారాన్ని సంయుక్తంగా అందుకోనున్నారు డేవిడ్ జూలియస్ (David Julius), ఆర్డెమ్ పటాపౌటియాన్ (Ardem Patapoutian) అనే అమెరికన్ శాస్త్రవేత్తలు. స్టాక్‌హోమ్‌లో సమావేశమైన నోబెల్ కమిటీ ఈ విషయం ప్రకటించింది. స్పర్శ, ఉష్ణోగ్రతను శరీరం ఎలా గ్రహిస్తుంది.. ఎలా స్పందిస్తుందనే విషయాన్ని కనిపెట్టారు మాలిక్యులర్ బయాలజిస్టులైన (Molecular Biology) ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు. నొప్పి నివారణలో కొత్త మార్గాలు అనుసరించేందుకు వీరి పరిశోధన అవకాశం కల్పిస్తుంది.
“మన మనుగడ కోసం, మన చుట్టూ ఉన్న ప్రపంచంతో కలిసి ఉండటానికి.. వేడి, చల్లదనం, స్పర్శను మనం ఎలా గ్రహిస్తామన్నది చాలా కీలకం. మన నిత్యజీవితంలో ఈ అనుభూతులను చాలా తేలిగ్గా తీసుకుంటాం. మరి ఉష్ణోగ్రత, ఒత్తిడిని గ్రహించేందుకు నరాల్లో ఎలాంటి ప్రేరణ మొదలవుతుంది? ఈ ప్రశ్నకు ఈ సంవత్సరపు నోబెల్ పురస్కార గ్రహీతలు సమాధానం కనిపెట్టారు” అని నోబెల్ కమిటీ ప్రశంసించంది. అంతేకాదు, ఒక సృష్టి రహస్యాన్ని వారు కనుగొన్నారని కితాబిచ్చింది.
వేడిని చర్మం గ్రహించేటప్పుడు నరాల్లో ఏ సెన్సర్ స్పందిస్తుందో తెలుసుకునేందుకు మిరపకాయల్లో ఉండే ఘాటైన పదార్థం క్యాప్సైసిన్ను ఉపయోగించారు యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్త డేవిడ్ జూలియస్. అలాగే చర్మం, అంతర్గత అవయవాల్లో యాంత్రిక ప్రేరణకు స్పందించే సెన్సర్లను గుర్తించేందుకు ప్రెషర్-సెన్సిటివ్ సెల్స్ ఉపయోగించారు ఆర్డెమ్ పటాపౌటియాన్. ఆర్డెమ్ హోవార్డ్ హోగ్స్ మెడికల్ ఇనిస్టిట్యూట్‌లో పనిచేస్తున్నారు. వీరు కనిపెట్టిన ఈ విజ్ఞానం అనేక రోగాలతో పాటు తీవ్రమైన నొప్పులకు సంబంధించిన చికిత్స విధానాలు అభివృద్ధి చేసేందుకు ఎంతో దోహదపడుతోంది.
కోవిడ్ 19 వ్యాక్సిన్ ఆవిష్కర్తలకు లభిస్తుందని అంచనాలు
వాస్తవానికి ఈ సంవత్సరం కొవిడ్-19 వ్యాక్సిన్ తయారు చేసిన వారిలో ఒకరికి నోబెల్ పురస్కారం లభించవచ్చని చాలా మంది ఊహించారు. నోబెల్ పురస్కారాలను ఏటా అక్టోబర్ మొదటి వారంలో ప్రకటిస్తారు. సోమవారం వైద్యశాస్త్రానికి, మంగళవారం ఫిజిక్స్, బుధవారం కెమిస్త్రీ రంగాల్లో పురస్కారాలు ప్రకటించడం సంప్రదాయం. ఆ తర్వాత రోజుల్లో సాహిత్యం, శాంతి బహుమతి ఉంటుంది.
ఎప్పటి నుంచి నోబెల్ పురస్కారం ప్రారంభమైంది?
వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని 1901 నుంచి ఈ సంవత్సరం వరకు 111సార్లు ప్రకటించారు. రెండు వివాహిత జంటలు సహ 222 మంది దీన్ని అందుకున్నారు. వీరిలో మహిళలు 12 మందే ఉన్నారు. నోబెల్ పురస్కారం కింద ఈ సంవత్సరం 10 మిలియన్ల స్వీడిష్ క్రోనార్లు.. అంటే 1.1 మిలియన్ డాలర్లు, ఒక నోబెల్ మెడల్‌తో పాటు పతకాలు అందిస్తారు. ఏటా డిసెంబర్ 10న స్టాక్‌హోమ్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించే కార్యక్రమంలో నోబెల్ పురస్కారాలు ప్రదానం చేస్తారు.
డైనమైట్ను కనిపెట్టిన స్వీడన్‌కు శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారం.. వైద్యం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాహిత్యం, శాంతి విభాగాల్లో ఏటా నోబెల్ పురస్కారాలు అందజేస్తున్నారు. 1901 నుంచి వీటిని ప్రదానం చేస్తున్నారు. 1969 నుంచి ఆర్థిక శాస్త్రంలోనూ నోబెల్ పురస్కారం అందజేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.