Home /News /uncategorized /

COCKS GETTING READY FOR SANKRANTHI SEASON IN ANDHRA PRADESH PRN

Andhra Pradesh: ఇటు పందెం కోళ్లు..! అటు పోలీసులు..! సంక్రాంతికి నువ్వా-నేనా..!

ఫైల్ ఫోటో

ఫైల్ ఫోటో

తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి పండగ అంటేనే ఓ సంబరం. ఆ సంబరంలో కోడి పందాలు మరింత స్పెషల్. ఇటు పందెం రాయుళ్లు.. అటు కోళ్లు.. సంక్రాంతి సమరానికి సిద్ధమవుతున్నాయి.

    తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి పండగ అంటేనే ఓ సంబరం. ఆ సంబరంలో కోడి పందాలు మరింత స్పెషల్. ఒక పక్క కరోనా, మరోపక్క పోలీసుల కేసులు అయినా సరే మాకు సంబంధం లేదంటూ పందెంరాయుళ్లు కోళ్లను సిద్ధం చేస్తున్నారు. అటు పంజులు కూడా బరుల్లో కత్తులు దూసేందుకు కఠోర సాధన చేస్తున్నాయి. ఏడాది నుంచి ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటూ నువ్వా నేనా అంటూ తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. కోర్టుల ఆంక్షలు, పోలీసుల హెచ్చరికలు ఎన్ని ఉన్నా పందాల రాయుళ్లు మాత్రం వాటిని లెక్కచేయడం లేదు. ఒకపక్క పందాలకు బరులను సిద్ధం చేసే పనిలో నిర్వాహకులు బిజీగా ఉంటే.., మరోపక్క కోట్ల రూపాయల పందాలు గెలిచే కోడి పుంజులకు శిక్షణ ఇస్తూ ఇంకా బిజీగా మారిపోయారు పందెం కోళ్ల పెంపకం దారులు.

    వందలాది పెంపకం కేంద్రాలు
    ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలో పందెం కోళ్ల పెంపకం కేంద్రాలు దాదాపు 500లకు పైనే ఉన్నాయి. ఒక్కొక్క ఫామ్ లో 100 నుండి 150 కోళ్లకు ట్రైనింగ్ ఇస్తున్నారు. సంక్రాంతి సమీపిస్తుండటంతో జిల్లాలో ఇప్పటికే 50వేల కోళ్లకు పైనే పందాలకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా పాలకొల్లు, భీమవరం, నరసాపురం, ఆచంట, ఉండి, దెందులూరు, ద్వారకాతిరుమల, పంగిడిగూడెం, గుణ్ణంపల్లి, పెదవేగి, జంగారెడ్డిగూడెం, గణపవరం లాంటి ప్రాంతాల్లో పందెం కోళ్ల తయారీ కేంద్రాలు ఉన్నాయి. కొన్ని కేంద్రాల్లో స్పెషల్ గా మేలు జాతి పందెం పుంజుల, పెట్టల నుండి గుడ్లను పొదిగించి ఆ పిల్లలను జాగ్రత్తగా పెంచుతున్నారు. ఆరు నెలల నుండి సంవత్సరం వయస్సు వచ్చే వరకు గుంపులుగా బయట పెంచి తర్వాత నుండి ఒక్కొక్క పందెం కోడిని విడివిడిగా పెంచుతారు. ఈ పందెం కోళ్లను పెంచడానికి విశాలమైన స్థలాలను లీజుకు తీసుకుంటారు. వాటి కోసం ప్రత్యేకంగా గాబులు, గ్రిల్స్ తో కూడిన బాక్సులు తయారు చేయిస్తారు.

    కోడి పుంజు జాతిని బట్టి పందెం
    ముఖ్యంగా పందాలను ట్రైనింగ్ ఇచ్చే కోళ్ల జాతులు కూడా దాదాపుగా 30 వరకు ఉన్నాయి. వీటిలో డేగ, కాకి, కాకిడేగ, నెమలి, కాకి నెమలి, నెమలి డేగ, ఎర్ర కొక్కిరాయి, నెమలి పింగళ, సీతువా, రసింగి, పచ్చ కాకి, అబ్రాస్,తెల్ల కొక్కిరాయి, పెట్టమారి, కోడి డేగ, నల్ల కొక్కిరాయి, డేగ పూల లాంటి పందెం కోళ్లు చాలా ముఖ్యమైనవి. ఈ జాతులను బట్టే పందెం రాయుళ్లు బెట్టింగులు కాస్తారు.

    పోలీసుల దాడులు షురూ
    ప్రస్తుతం కొడివ్ స్ట్రెయిన్ విజృంభించే ప్రమాదముండటంతో కోడి పందేల నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు కోడి పందేలపై కోర్టులు సీరియస్ గా ఉండటంతో ఎక్కడ నిర్వహించినా లోపలేస్తామంటున్నారు. పందేలు నిర్వహించేవారిపైనే కాకుండా, పందెం కోళ్ల పేరుతో వ్యాపారం చేసినా, కత్తులు అమ్ముతున్నా, కోళ్లకు కత్తులు కడుతున్న వారిపైన బెండోవర్ కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో వ్యాప్తంగా 900 మందిపై బెండోవర్ కేసులు నమోదు చేసిన పోలీసులు దాదాపు 5వేల కత్తులు స్వాధీనం చేసుకున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: AP Police, Cock fight, Sankranti, West Godavari

    తదుపరి వార్తలు