భారతదేశ రాజకీయ యవనిక పై సరికొత్త అధ్యాయానికి తొలి అడుగు పడింది. దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పే లక్ష్యంగా ఢిల్లీ నడిబొడ్డున బీఆర్ఎస్ పార్టీ (BRS Party) జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్ లోని రోడ్డు నెంబర్ 5లో బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (CM KCR) మధ్యాహ్నం 12 గంటలకు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు కేసీఆర్ కు ఘనస్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు ఫణిశశాంక శర్మ, గోపీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో చేపట్టిన రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో సీఎం కేసీఆర్, సతీమణి శోభారాణి దంపతులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. యాగంలో కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, తమిళనాడు విసికె పార్టీ అధ్యక్షుడు, ఎంపి తిరుమావళవన్, జాతీయ కిసాన్ నేత గుర్నామ్ సింగ్ తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.
దేశ రాజధానిలో ఎగిరిన గులాబీ జెండా..
పూర్ణాహుతి అనంతరం 12 గంటల 37 నిమిషాలకు సీఎం కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. తదనంతరం అతిథులు, పార్టీ ప్రముఖులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ జాతీయ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మొదటి అంతస్తులోని తనకు కేటాయించిన ఛాంబర్లో జాతీయ అధ్యక్షుడి హోదాలో కుర్చీలో ఆసీనులయ్యారు.
నియామకాలు:
బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా, హర్యానా కురుక్షేత్రకు చెందిన జాతీయ రైతు సంఘం నేత, గుర్నామ్ సింఘ్ చడూని అధినేత కేసీఆర్ నియమించారు. కార్యాలయ కార్యదర్శి గా రవి కొహార్ ను నియమించారు. జాతీయ అధ్యక్షుడి హోదాలో తొలి నియామక పత్రాలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఎంపీ నామా నాగేశ్వర్ రావు తన నివాసంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్నభోజనానికి సీఎం కేసీఆర్ తో పాటు ముఖ్య అతిథులు, ఇతర ప్రముఖులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులంతా హాజరయ్యారు.
ఢిల్లీలో బీఆర్ఎస్ జోష్..
బీఆర్‌ఎస్ పార్టీ నూతన జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీలోని సర్దార్‌పటేల్ రోడ్డు జై కేసీఆర్, జై భారత్, జై బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తింది. బీఆర్‌ఎస్ పార్టీ ఫ్లెక్సీలు, కటౌట్లతో ఆ ప్రాంతమంతా గులాబిమయమైంది. పలు రాష్ట్రాల నుండి వచ్చిన అతిథులు, పలు పార్టీలకు చెందిన నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఉత్సాహవంతమైన వాతావరణం నెలకొన్నది. దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయం తెలంగాణ భవన్, సీఎం అధికారిక నివాసం 23 తుగ్లక్ రోడ్ లోనూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల కేరింతలు, నినాదాలతో సందడి వాతావరణం నెలకొంది.
BRS Party Chief and CM Sri KCR inaugurates BRS (Bharat Rashtra Samithi) office in Delhi. Samajwadi Party Chief Sri @yadavakhilesh, JD(S) Leader Sri @hd_kumaraswamy, VCK MP Sri @thirumaofficial and others took part in the inauguration ceremony. pic.twitter.com/dDyMiwRphI
— BRS Party (@BRSparty) December 14, 2022
ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష యాదవ్, జేడీఎస్ పార్టీ అధ్యక్షుడు, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి, తమిళనాడు విసికె పార్టీ అధ్యక్షుడు, ఎంపి తిరుమావళవన్, జాతీయ భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు గుర్నాం సింగ్, ఇతర రైతుసంఘాల నాయకులు, మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ , వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ , మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు కె. కేశవరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, కె.ఆర్. సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, పసునూరి దయాకర్ రావు, మాలోత్ కవిత, మన్నె శ్రీనివాసులు రెడ్డి, నామా నాగేశ్వర్ రావు, పి రాములు, వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ కవితతో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.