అధికారులపై సీఎం జగన్ అసంతృప్తి... మళ్లీ బదిలీలు తప్పవా ?

AP CM YS Jagan | పరిపాలనపై పట్టు సాధించేందుకు వీలుగా వివిధ కీలక శాఖల్లో తమకు అనుకూలంగా ఉండే అధికారులను నియమించుకున్న సీఎం జగన్ … ఆ మేరకు వారి నుంచి స్పందన రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: July 9, 2019, 7:35 PM IST
అధికారులపై సీఎం జగన్ అసంతృప్తి... మళ్లీ బదిలీలు తప్పవా ?
వైఎస్ జగన్ (File)
  • Share this:
ఏపీలో పాలనాపగ్గాలు చేపట్టగానే సీఎం జగన్ తన టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల స్ధానభ్రంశంతో పాటు తెలంగాణ, ఢిల్లీలో ఉన్న అధికారులను డిప్యుటేషన్ పై రాష్ట్రానికి రప్పించేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఇందులో ఐపీఎస్ సీతారామాంజనేయులు, ఐఈడీఎస్ ( ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ ) అధికారి ఏవీ ధర్మారెడ్డి వంటి అధికారులను మాత్రమే రాష్ట్రానికి రప్పించగలిగారు. ఐపీఎస్ అదికారి స్టీఫెన్ రవీంద్ర, ఐఏఎస్ శ్రీలక్ష్మి డిప్యుటేషన్ కు కేంద్రం మోకాలడ్డటంతో వీరి రాక కోసం జగన్ సర్కారు ఎదురు చూస్తోంది.

పరిపాలనపై పట్టు సాధించేందుకు వీలుగా వివిధ కీలక శాఖల్లో తమకు అనుకూలంగా ఉండే అధికారులను నియమించుకున్న సీఎం జగన్ … ఆ మేరకు వారి నుంచి స్పందన రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొత్త ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన విత్తనాల కొరత వ్యవహారంలో అధికారులు ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయడం లేదని భావిస్తున్నట్లు సమాచారం. విత్తనాల కొరతను అధిగమించడం లేదా ప్రత్యామ్నాయ మార్గాలకు వెళ్లడం వంటి అంశాల్లో అధికారులు విఫలం కావడం వల్లే విపక్ష టీడీపీ ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకుంటోందని సీఎం భావిస్తున్నారు.

అదే విధంగా కరెంటు కోతలు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పలు పథకాల అమలు, ఉద్యోగుల బదిలీల వ్యవహారాల్లోనూ అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని జగన్ భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పథకాల అమలులో కీలక శాఖలకు నేతృత్వం వహిస్తున్న అధికారులు అలసత్వం వహిస్తున్నట్లు సీఎం జగన్ కు తాజాగా నివేదికలు అందాయి. ఏం చేస్తే ఏమవుతుందన్న భయంతో కొందరు, అలసత్వంతో మరికొందరు ప్రభుత్వ పథకాల పట్ల అంటీముట్టనట్టుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. దీంతో తాజాగా జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులను కూడా నియమించిన సీఎం జగన్... వారికి కీలక అంశాల్లో అధికారులకు మార్గదర్శనం చేయాలని సూచించినట్లు తెలిసింది.

సకాలంలో స్పందించగలిగితే దాదాపు ప్రతీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్న జగన్.. ఆ మేరకు ప్రభుత్వ విధానానికి అనుగుణంగా పనిచేయాలని అధికారులను పదేపదే కోరుతున్నారు. కీలక అంశాల్లో ఐఏఎస్ అధికారులు తనతో పోటీపడుతూ పనిచేయడం లేదని సీఎం జగన్ భావిస్తుండటంతో ఈ వ్యవహారంలో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న భయం అధికారుల్లో మొదలైంది. పరిస్ధితిలో ఎలాంటి మార్పు లేకపోతే త్వరలోనే మరోసారి కీలక స్ధానాల్లో ఉన్న పలువురు అధికారులను బదిలీ చేసినా ఆశ్చర్యం లేదనే వాదన ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది.(సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 కరెస్పాండెంట్, విజయవాడ)First published: July 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>