(P.Srinivas,New18,Karimnagar)
ఇంటి ఆవరణను ఈత వనంగా మర్చి ఉపాధి అవకాశాలు పొందుతున్నాడు. ఆరు పదుల వయసులో కూడా అలుపెరుగకుండా కష్టపడి పనిచేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. కానరాని దేశాలు పోయి కష్టాలు పడే బదులు ఉపాయం ఉంటే ఉన్నచోటే పని వెతుక్కోవచ్చు అని చెపుతున్నారు గంగారాం గౌడ్(Gangaram Goud). జగిత్యాల (Jagityala)జిల్లాలో వృద్ధాప్యానకి చేరువైన వ్యక్తి తీసుకున్న నిర్ణయం, చేస్తున్న పని ..ఆ ఊరిలో నలుగురికి ఆదర్శంగా మారింది. ఇంతకీ ఆయన ప్రత్యేకత ఏంటీ..ఆ వ్యక్తి సక్సెస్ స్టోరీ వెనుక దాగివున్న సీక్రెట్ ఏంటో తెలుసా.
ఓల్డ్ మెన్ కాదు గోల్డ్ మెన్ ..
ఆతని పేరు గుండవేణి గంగారాం. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్రావుపేటకు చెందిన ఇతడు వృత్తి రీత్యా గీత కార్మికుడు .గంగారాంకు ఇద్దరు కొడుకులు,ఒక కూతురు.కొన్నేళ్ల క్రితం విదేశాలకు వెళ్లిన గంగారాం అక్కడ కార్మిక పని చేసి జీవనం పొందాడు.అదే సమయంలో పిల్లల పెళ్లిళ్లు కూడా చేసాడు.అయితే వయసు పెరగడం, ఆరోగ్యం సహకరించకపోవడంతో స్వదేశానికి తిరిగి వచ్చాడు.ఇంటి దగ్గర వున్న గంగారాం కుటుంబ పోషణ కోసం, ఉపాధి కోసం తనకు ఇష్టమైన కులవృత్తిని నమ్ముకుని ఈతచెట్లు గీస్తున్నాడు.అయితే ఊరి బయట ఉన్నఈత చెట్లను రోజురోజుకు పట్టాదారులు తీసేస్తుండడంతో ఇబ్బందులు పడ్డాడు.దీనితో బాగా ఆలోచించిన గంగారాం ఇంటి ఆవరణలో తనకున్న ఆరుగుంటల ఖాళీ స్థలంలో 170 ఈత మొక్కలు నాటాడు.మూడేళ్ళ క్రితం నాటిన మొక్కలు ఇప్పుడు ఏపుగా పెరిగాయి.మరి కొద్దిరోజుల్లో కల్లు గీయుటకు అనుకూలంగా ఉండడంతో గంగారాం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
స్వశక్తితో ఉపాధి, కులవృత్తి..
ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం లేకున్నా 70 వేయిల పెట్టుబడి పెట్టి మొక్కలు నాటానని గంగారాం చెపుతున్నాడు.అటు ఊరి చివరన ఉన్న కొన్ని ఈత చెట్లను రోజు గీస్తూనే ఇంటివద్ద ఉన్న ఈత వనాన్ని పెంచుతున్నాడు. ఎప్పటికప్పుడు ఎరువులు వేస్తూ, కలుపు మొక్కలను పీకేస్తూ తన భార్య సహకారంతో మొక్కలను పెంచుతున్నాడు.ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తే మరిన్ని చెట్లు పెంచి నిరుద్యోగ గీత కార్మికులకు ఉపాధి కల్పిస్తానని చెపుతున్నాడు.
రోల్ మోడల్ ..
ఏది ఏమైనా అరవై ఏళ్ల వయసులో ఈత చెట్లు ఎక్కి కల్లు గీస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు గంగారాంగౌడ్. అంతేకాకుండా ప్రభుత్వం సహాయం అందిస్తే మరిన్ని చెట్లను పెంచి మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ధైర్యంగా చెపుతున్నాడు. ఇప్పటికే తాను పెంచిన ఈత వనం చూసి చాల మంది తనను స్పూర్తిగా తీసుకోని మొక్కలు నాటడం ప్రారంభించారంటున్నారు. ఎవరికి వారే ఈవిధంగా ఈతవనం నాటుతే రానున్న రోజుల్లో మరికొంత మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jagityal, Telangana News