మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రంలోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లోనూ పెళ్లికాని ప్రసాద్‌ల సంఖ్య బాగానే ఉంది. పెళ్లి కోసం చాలామంది యువకుల ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు తమకు నచ్చిన అమ్మాయి దొరికే వరకు వెతికి పెళ్లి చేసుకునే పరిస్థితులు ఇప్పుడు మారిపోయాయి. అమ్మాయి ఓకే చెబితే.. పెళ్లికి సై అనేసే అబ్బాయిల సంఖ్య పెరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పెళ్లి విషయంలో ఛాయిస్ అబ్బాయిల నుంచి అమ్మాయిలకు మారింది. దేశంలో పెళ్లికాని అబ్బాయిల పరిస్థితి ఏ విధంగా ఉంది ? పెళ్లి కోసం అబ్బాయిలు ఎంతగా కష్టపడుతున్నారో చెప్పడానికి మదురైలో వెలిసిన పోస్టర్ ఓ ఉదాహరణగా నిలుస్తోంది.
సాధారణంగా కొన్ని ప్రకటనలు, పబ్లిసిటీ కోసం వాల్ పోస్టర్లు వేస్తుంటారు. కానీ మధురైకు చెందిన ఓ యువకుడు ఏకంగా తనకు పెళ్లి కోసం అమ్మాయి కావాలంటూ పోస్టర్లు వేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగని ఆ అబ్బాయి మరీ ముదిరిపోయిన కుర్రాడేమీ కాదండోయ్. అతడి వయసు జస్ట్ 27 ఏళ్లు. ఆ వయసుకే పెళ్లి కోసం అమ్మాయిలు దొరక్క మనోడు ఈ రకమైన వెరైటీ ఆలోచనతో ముందుకెళ్లే వరకు వచ్చేశాడు.
మదురై విల్లాపురం సమీపంలోని మీనాక్షికి చెందిన 27 ఏళ్ల జగన్ బీఎస్సీ ఐటీ పూర్తి చేసి నెలకు రూ.40 వేలు వేతనంతో పాటు ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అంతేకాదు ఓ బిర్యానీ షాపులో పార్ట్ టైమ్ పని కూడా చేస్తున్నాడు. అయితే నాలుగేళ్లు గడుస్తున్నా ఇతడికి పెళ్లి కావడం లేదు. దీంతో దిండిగల్ జిల్లా సహా ప్రాంతాల్లో గోడలపై పెళ్లికూతురు కోసం పోస్టర్లు వేయడం ప్రారంభించాడు.
దీనిపై జగన్ స్పందించాడు. పెళ్లి కాకపోవడం వల్లే ఈ రకంగా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు. పెళ్లి కోసం తాను ఎన్నో ప్రయత్నాలు చేశానని.. కానీ అవేవీ పెద్దగా సత్ఫలితాలు ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు. అందుకే ఈ రకంగా చేసినట్టు వివరించాడు. మొత్తానికి పెళ్లి కోసం ఓ కుర్రాడు.. అదీ 27 ఏళ్ల యువకుడు ఈ రకంగా పోస్టర్లు వేయడం ఆ ప్రాంతంలో హాట్ టాపిక్‌గా మారింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.