విమానయానం అందుబాటులోకి వచ్చిన తరువాత దేశ విదేశాలకు కొన్ని గంటల్లోనే వెళ్లగలుగుతున్నాం. అంతకు ముందు పెద్ద పెద్ద ఓడల్లో కొన్ని నెలల పాటు ప్రయాణించి వేరే దేశాలకు వెళ్లడం పెద్ద సమస్యగా ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి సమస్యలు లేవు. ఇందుకు విమానాల్లో ఎగరాలనే ఆలోచన వచ్చిన రైట్ బ్రదర్స్(Wright Brothers)కు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. వారి జ్ఞాపకార్థం నేడు ‘రైట్ బ్రదర్స్ డే’(Wright Brothers Day)ను జరుపుకుంటారు. ప్రపంచంలో మొట్టమొదటిసారి విమానాన్ని తయారుచేసి, అది గాల్లో ఎగిరేలా విజయవంతంగా ప్రయోగం చేశారు వారు. 1903వ సంవత్సరం డిసెండర్ 17న మొదటిసారి విమాన ప్రయోగం విజయవంతమైంది. దీన్ని ఓర్విల్లే రైట్ (Orville Wright), విల్బర్ రైట్ (Wilbur Wright) అభివృద్ధి చేశారు. 1903 డిసెంబర్ 17న నార్త్ కరోలినా లోని కిల్ డెవి హిల్స్ ప్రాంతంలో విమానం గాల్లోకి ఎగిరింది.
వారిద్దరి కృషితోనే..
రైట్ బ్రదర్స్ అభివృద్ది చేసిన విమానం ప్రపంచ విమానయాన రంగానికి పునాదులు వేసింది. ఆ తరువాత ప్రపంచ దేశాలు ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేసుకొని, విమాన ప్రయాణాలకు అనుమతులు ఇచ్చాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 17న రైట్ బ్రదర్స్ డేను నిర్వహించాలని 1959లో నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఈ వేడుకలు నిర్వహించాలని అప్పటి అమెరికా అధ్యక్షుడు డ్వైట్ డి ఐసన్‌హోవర్ ప్రతిపాదించారు. రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు.
ఇందుకు అవసరమైన మెకానిక్ పని నేర్చుకోవడానికి ప్రింటింగ్ ప్రెస్‌లు, సైకిళ్ళు, మోటార్లు, యంత్రాలు రిపేర్లు చేసే దుకాణంలో పనిచేశారు. సైకిళ్లను రిపేర్లు చేస్తున్నప్పుడే.. గాల్లో ఎగిరే విమానాలకు కూడా బ్యాలెన్స్ చేయగలమని, వాటిని నియంత్రించగలమని వారికి నమ్మకం కుదిరింది. 1900 నుంచే విమానాన్ని తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. 1903 సంవత్సరం చివరినాటికి వారి ప్రయోగం ఫలించింది. ఈ మూడేళ్లలోనే రైట్ బ్రదర్స్ పైలట్లుగా నైపుణ్యాలు అభివృద్ధి చేసుకున్నారు.
విమానం పేరేంటి?
రైట్ బ్రదర్స్ రూపొందించిన మొట్టమొదటి విమానానికి రైట్ ఫ్లైయర్ (Wright Flyer) అనే పేరు పెట్టారు. దీన్ని ఫ్లైయర్ I, 1903 ఫ్లైయర్ అని కూడా పిలిచేవారు. 1900 నుంచి 1902 మధ్య కిట్టి హాక్ వద్ద ఈ విమానానికి గ్లైడర్ టెస్ట్‌లు చేసి దాని పనితీరును, డిజైన్‌ను అభివృద్ధి చేశారు. 1903లో దానికి తుదిరూపు ఇచ్చి, చివరిసారి గ్లైడర్ ఫ్లైయర్ టెస్ట్ చేశారు. రైట్ బ్రదర్స్‌తో పాటు రిపేర్ షాప్‌లో పనిచేసే చార్లీ టేలర్ అనే ఉద్యోగి విమానానికి ఇంజిన్ తయారుచేశారు.
ప్రస్తుతం విమానాన్ని వాషింగ్టన్‌లోని నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో (National Air and Space Museum) భద్రపరిచి ప్రదర్శిస్తున్నారు. 1904–05లో రైట్ ఫ్లైయర్ II అనే మరో విమానాన్ని కూడా రైట్ బ్రదర్స్ తయారుచేశారు. ఎక్కువ సమయం గాల్లో ఎగిరే ఏరోడైనమిక్ విమానాలను వారు అభివృద్ధి చేశారు. దీని తరువాత మొట్టమొదటి ప్రాక్టికల్ ఫిక్స్‌డ్ వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ అయిన రైట్ ఫ్లైయర్ III ని కూడా రైట్ బ్రదర్స్ తయారుచేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flight