
ప్రతీకాత్మక చిత్రం
Viral News: దరిద్రం నెత్తి మీద డ్యాన్స్ చేయడమంటే ఇదే..! చోరీలు చేసి పోలీసులకు దొరక్కుండా ముప్పు తిప్పలు పెట్టే దొంగలు చాలా మందే ఉన్నారు. కానీ ఈ దొంగలు మాత్రం దురదృష్టానికి కేరాఫ్ అడ్రస్ గా మారారు.
దరిద్రం నెత్తి మీద డ్యాన్స్ చేయడమంటే ఇదే..! చోరీలు చేసి పోలీసులకు దొరక్కుండా ముప్పు తిప్పలు పెట్టే దొంగలు చాలా మందే ఉన్నారు. కానీ ఈ దొంగలు మాత్రం దురదృష్టానికి కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఏదైనా దొంగతనం జరిగితే.. బాధితులు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇస్తారు. లేదా.. మరెవ్వరైనా పోలీసులకు కాల్ చేస్తారు. అయితే, ఇక్కడ సీన్ మొత్తం రివర్స్.. చోరీ చేస్తూ దొంగలే స్వయంగా పోలీసులకు ఫోన్ చేశారు. పాపం.. అది వారు కావాలని చేసిన పని కాదు. పొరపాటున అలా జరిగిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇంగ్లాండ్‌లోని స్టాఫోర్డ్‌షైర్ పోలీస్ స్టేషన్లో చీఫ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న జాన్ ఓవెన్ ఇటీవల చోటుచేసుకున్న ఓ ఫన్నీ కేసు వివరాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా హోం ఎలోన్ సినిమాలోని ఓ పాపులర్ క్యారెక్టర్ సీన్‌ను ఇమేజ్‌తో.. ప్రపంచంలోనే అత్యంత దురదృష్టకర దొంగలు వీరేనంటు ఆ కేసు గురించి తెలిపారు.ఈ ఏడాది జనవరి 6వ తేదీ రాత్రి 9.10 గంటల సమయంలో పోలీసులకు ఓ అనుమానస్పద ఫోన్ కాల్ వచ్చింది. అందులో ఇద్దరు దొంగలు చోరీ చేస్తూ మాట్లాడుకోవడం వినిపించింది. అనుమానంతో పోలీసులు ఆ కాల్‌ను ట్రాక్ చేశారు. ఆ ఫోన్ కాల్ వచ్చిన ఇంటికి చేరుకోగా ఇద్దరు దొంగలు చోరీ చేస్తూ బిజీగా కనిపించారు. అంతే, పోలీసులు వారిని లొంగిపోవాలని హెచ్చరించారు. దీంతో వారు పోలీసులకు లొంగిపోయారు.
పోలీసులకు వచ్చిన ఆ కాల్.. ఆ ఇద్దరి దొంగల్లో ఒకరి ఫోన్ నుంచి వచ్చిందేనని పోలీసులు తేల్చారు. వారిలో ఒక దొంగ పొరపాటున తన ఫోన్ మీద కూర్చున్నాడని, దీంతో పోలీస్ ఎమర్జెన్సీ నెంబరు 999 డయల్ కావడంతో ఆ కాల్ పోలీసులకు చేరిందని ఓవెన్ ట్వీట్టర్లో వివరించారు. ఆ దొంగల్లో ఒకరి వయస్సు 49, మరొకరిది 42 అని తెలిపారు. ఈ ట్వీట్‌పై నెటిజనులు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ప్రపంచంలోనే అతి దురదృష్టకరమైన దొంగలంటూ జాలి చూపిస్తున్నారు.
Published by:Sridhar Reddy
First published:January 09, 2021, 15:00 IST