ఈ రోజు(ఫిబ్రవరి 2) ప్రపంచ వ్యాప్తంగా చిత్తడి నేలల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. భూమిపై ప్రాణికోటి మనుగడకు చిత్తడి నేలలే మూలం. చిత్తడి నేలలను భూమికి ఉన్న మూత్రపిండాలు అని కూడా అంటారు. ఇవి నీటి వనరులకు, మంచినీటికి మూలాలుగా ఉన్నాయి. భూమి ఉపరితలం నుంచి వ్యర్థాలను చిత్తడి నేలలు ఫిల్టర్ చేస్తాయి. మన దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఇవి 4.63 శాతం వరకు ఉండటం విశేషం. వీటిని పరిరక్షించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2న వరల్డ్ వెట్‌ల్యాండ్స్ డేను నిర్వహిస్తారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునెస్కో ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. ఈ ఏడాది చిత్తడి నేలల దినోత్సవానికి 'చిత్తడి నేలలు, నీరు' (వెట్ ల్యాండ్స్ అండ్ వాటర్) అనే థీమ్‌ను యునెస్కో ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా వీటి పరిరక్షణ కోసం రామ్సార్ కన్వెన్షన్‌ను రూపొందించారు. మన దేశం 1982లో ఇందులో చేరింది.
నదులు, సరస్సులు, డెల్టాలు, ఉపరితల నీటి వనరులు, పగడపు దీవులు వంటివన్నీ చిత్తడి నేలల కిందకు వస్తాయి. కొన్ని సీజనల్‌గా ఏర్పడతాయి. మరికొన్నింటిని మనుషులు అవసరాల కోసం నిర్మిస్తున్నారు. నీటి స్వభావంతో సంబంధం లేకుండా, వివిధ రకాల వివిధ ప్రాంతాల్లో నీటి వనరుల లోతు ఆరు మీటర్లకు మించని వాటిని చిత్తడి నేలలుగా పరిగణిస్తారు. కాలుష్యం పెరగడం, పట్టణీకరణ, అభివృద్ధి వంటి కారణాల వల్ల భారతదేశంలో సహజంగా ఏర్పడిన చిత్తడి నేలలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. భారత్ ఇప్పటికే మూడింట ఒక వంతు చిత్తడినేలలను కోల్పోయిందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. వీటిని కాపాడుకోవాలని, ప్రభుత్వం ఇందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిపుణులు కోరుతున్నారు.
* చిత్తడి నేలలను ఎందుకు సంరక్షించుకోవాలంటే...
చిత్తడి నేలలు హైడ్రలాజికల్ సైకిల్‌కు మూలాలు. నీటి నిల్వ, శుద్ధి చేయడాన్ని ఇవి సులభతరం చేస్తాయి. వీటిని సంరక్షించకపోతే ఇలాంటి సహజ ప్రక్రియలకు అవరోధాలు కలుగుతాయి. చిత్తడి నేలలు ఎంతోమంది ప్రజలకు జీవనాధారంగానూ ఉన్నాయి. ఇవి వరదల బారిన పడకుండా కాపాడతాయి. తుఫానుల వంటివి ఏర్పడినప్పుడు నీటిని సంరక్షించేందుకు, వర్షపు నీటిని నిల్వచేసేందుకు ఇవి తోడ్పడతాయి. వీటిని కాపాడకపోతే ప్రకృతి విపత్తులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కర్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటు కాలుష్య నివారణకు కూడా ఇవి సహాయపడతాయి. చిత్తడి నేలలు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా సాధనాలుగా పనిచేస్తాయి. వీటిల్లో పెరిగే వివిధ రకాల మొక్కలు ఆక్సిజన్ అవసరాలను తీరుస్తాయి. జీవ వైవిధ్యానికి, మనిషి మనుగడకు చిత్తడి నేలలు కృషి చేస్తున్నాయి. అందువల్ల వీటి సంరక్షణ కోసం నేడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.