World Population Day 2020 : గత 30 ఏళ్లుగా మనం ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాం. జులై 11న జనాభా పెరుగుదల, ఫలితంగా జరిగే పరిణామాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించుకుంటున్నాం. 1989లో ఐక్య రాజ్య సమితి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ రోజున మనం జనాభా పెరుగుదల వల్ల కలిగే సమస్యలకు పరిష్కారాలపై చర్చించుకుంటాం. 1987 జులై 11న ప్రపంచ జనాభా 500 కోట్లు దాటింది. అందుకే అప్పటి నుంచీ జులై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే... మానవ వనరులు అత్యవసరం. అలాగే ఏ దేశమైనా తిరోగమనం చెందేందుకు కూడా మానవ వనరులు కారణం అవుతున్నాయి. అందువల్ల జనాభా అనే వనరును సక్రమంగా ఉపయోగించుకోకపోతే, ప్రపంచ గమనానికే ముప్పు తప్పదన్నమాట.
ఏ దేశమైనా పెరిగిన జనాభాకు తగిన ఉద్యోగాలు, ఆహారం, ఆవాసం, సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. వీటిలో ఏవి తగ్గినా... పరిస్థితి అల్లకల్లోలంగా తయారవుతుంది. జపాన్ లాంటి ఎక్కువ భూమి లేని దేశాలకు జనాభా ఎప్పుడూ భారమే. చైనాలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నప్పటికీ... అందుకు తగినంత భూమి, వనరులు ఉండటం... మానవ వనరుల్ని ఆ దేశం సక్రమంగా వినియోగిస్తుండటంతో... చైనాకు జనాభా కలిసొస్తోంది. ఇండియా కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతూ... మానవ వనరుల్ని సక్రమంగా వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఐతే... ఇండియా ఈ దిశగా చేయాల్సింది చాలా ఉందన్నది నిపుణుల మాట.
ఓవరాల్‌గా జనాభా పెరిగితే... వనరులు తగ్గిపోతాయి. ఇప్పటికే చాలా దేశాల్లో చమురు నిల్వలు అడుగంటిపోయాయి. నీటికి విపరీతమైన కొరత ఏర్పడుతోంది. కరవు, కాటకాల్ని చూస్తున్నాం. ఆఫ్రికా దేశాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. అంతర్యుద్ధాలు, ఆక్రమణలు ఉండనే ఉన్నాయి. ఇక ఉగ్రవాదం ప్రపంచానికి పెనుముప్పుగా మారింది. ఇవన్నీ అశాంతి వల్ల తలెత్తే పరిణామాలు. ఈ అశాంతికి కారణాల్లో జనాభా పెరుగుదల కూడా ఒకటిగా కనిపిస్తోంది. ప్రపంచ దేశాలు జనాభా సంఖ్య పెరుగుదలపై దృష్టి సారిస్తూనే... వనరుల్ని సక్రమంగా వినియోగించే అంశాలపైనా ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది.
2010లో ప్రపంచ జనాభా 700 కోట్లు దాటింది. ప్రస్తుతం భూమిపై 800 కోట్లకు పైగా ప్రజలున్నారు. వీరిలో చైనా, ఇండియా కలిపి... 250 కోట్ల మందికి పైగా ఉన్నారు. ఐతే... 2050 నుంచీ ప్రపంచ జనాభా సంఖ్య తగ్గుతుందనే అంచనాలున్నాయి. ముఖ్యంగా చైనా, ఇండియాలో అభివృద్ధి, విదేశీ సంస్కృతుల కారణంగా... ప్రజలు పిల్లల్ని కనేందుకు ఆసక్తి చూపరనీ, ఇప్పటికే ఆ పరిస్థితి కనిపిస్తోందనీ నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో... ఈ ఆలోచనా ధోరణి మరింత ఎక్కువై... జనాభా పెరుగుదల తగ్గి... తిరోగమనంలోకి వెళ్తుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే... అందరికీ మంచిదే.
ప్రస్తుతం 2020లో... కరోనా సమస్య ప్రపంచ జనాభాను పట్టి పీడిస్తోంది. మరో రెండేళ్ల పాటూ ఈ సమస్య కొనసాగుతుందనే అంచనా ఉంది. కరోనా కారణంగా చాలా మంది పిల్లల్ని ఇప్పుడు కనేందుకు సిద్ధపడట్లేదు. ప్రెగ్నెన్సీలను వాయిదా వేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితి... 2020ని మహిళలు, బాలికల ఆరోగ్యం, వారి హక్కుల రక్షణ సంవత్సరంగా చెప్పింది. తద్వారా మహిళల రక్షణకు చర్యలు తీసుకుంటోంది. ఏది ఏమైనా ఈ కరోనా పోతే తప్ప ప్రపంచగమనం ముందుకుసాగే పరిస్థితి లేదు. అప్పటివరకూ అన్ని కార్యక్రమాలకూ ఆటంకాలు తప్పేలా లేవు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.