క్రిస్మస్ వేడుకలు మనకు ఒక మోస్తారుగానే జరిగినా పశ్చిమ దేశాల్లో మాత్రం అవి చాలా ఘనంగా జరుగుతాయి. ఇక క్రిస్మస్ వచ్చిందంటే ఆయా దేశాలలో ఉండే కళాకారులు... తమ కళాలకు, గళాలకు పనులు చెబుతారు. కొత్త పాటలు రాయడం, వాటిని ఆలపించడం వంటివి చేస్తుంటారు. స్పెయిన్ కు చెందిన ఇద్దరు గాయకులు కూడా ఇదే పని చేశారు. కానీ పాట పాడుతున్నాననే పరవశంలో మునిగిపోయిన ఆ గాయకురాలు.. తన జుట్టును కాల్చుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను స్వయంగా జుట్టు కాల్చుకున్న గాయకురాలే సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడం గమనార్హం.
వివరాల్లోకెళ్తే... స్పెయిన్ లోని మాడ్రిడ్ లో చోటు చేసుకుంది ఈ ఘటన. సోఫియా (sofiaellar) అనే గాయని.. తన బాయ్ ఫ్రెండ్ అల్వరొ సొలెర్ (alvaro soler) తో కలిసి పాట ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన సంభవించింది. క్రిస్మస్ వేడుకల కోసం ఈ జంట పాటలు ప్రాక్టీస్ చేస్తున్నది. అల్వరొ గిటార్ వాయిస్తూ దానికి తగ్గట్టుగా శ్రుతి కలుపుతున్నాడు. సోఫియా కూడా అందుకు తగ్గట్టుగా గొంతు కలిపింది.
మైమరిచి పాడుతున్న ఈ జంట వెనకాలే క్రిస్మస్ చెట్టుతో పాటు పక్కనే క్యాండిల్ కూడా వెలుగుతూ ఉంది. సొఫియా క్యాండిల్ పక్కనే కూర్చుంది. ఈ క్రమంలో సొఫియా వెనకాల క్యాండిల్ ఉన్నదనే విషయం మర్చి.. అటువైపునకు వంగి పాట పాడుతుండగా.. ఆమె జుట్టు క్యాండిల్ కు తాకింది. అది కాస్తా ఆమె జుట్టుకు అంటుకుంది.
అయితే కొద్దిక్షణం దాకా ఆమె కూడా.. తన జుట్టుకు నిప్పు అంటుకున్న విషయం గుర్తించలేదు. ఒక్కసారిగా వెనక నుంచి మంటలు ఎక్కువవడంతో ఆమె దానిని గుర్తించింది. ఈ సమయంలో ఆమె అదిరిపడింది. అల్వరొ ఆమె జుట్టకు అంటుకున్న మంటను ఆర్పే యత్నం చేశాడు. కానీ సొఫియానే త్వరగా వెళ్లి.. పక్కనే ఉన్న సింక్ లో నీళ్లతో ఆ మంటలను ఆర్పేసింది. కాగా.. స్వయంగా సొఫియానే ఈ వీడియోను Instagramలో పోస్ట్ చేయడం గమనార్హం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Published by:Srinivas Munigala
First published:December 29, 2020, 19:09 IST