సాధారణంగా మనం కొందరు వ్యక్తులను చూసినప్పుడు వారిని ఇంతకుముందు ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుంటుంది. ఏదో అనుబంధం ఉన్నట్లుగా కూడా అనిపించవచ్చు. కానీ చాలాసార్లు వారితో మాట్లాడేందుకు మనం వెనుకాడి అలాగే వెళ్లిపోతాం. అలాగే ఓ అమ్మాయి కూడా ఒక అబ్బాయిని చూసి ఇష్టపడింది. ఎక్కడో చూసినట్లుగా ఇద్దరూ కలిసి ఉన్నట్లుగా అనిపించినా.. మాట్లాడలేక వెళ్లిపోయింది. అయితే ఆ వ్యక్తిని మర్చిపోలేకపోయింది. దీంతో రెండు సంవత్సరాల తర్వాత అతడి కోసం సోషల్ మీడియా యాప్ టిండర్‌లో ఈ సమాచారం పొందుపరిచింది. ఈ వివరాలను తన బయోలో పేర్కొంది. విచిత్రమేంటి అంటే.. ఆ యువతి వెతుకుతున్న వ్యక్తి కూడా ఆమెను గుర్తించాడు. ఇంకేముంది.. ప్రస్తుతం వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు.
అమెరికాలోని సియాటెల్‌కి చెందిన ఓ మహిళ తాను ఆఫీస్‌కి వెళ్లే సమయంలో 70 నంబర్ బస్‌లో ప్రయాణం చేసేది. నవంబర్ 2019 లో ఆమె తన బస్‌లో ఓ వ్యక్తిని చూసింది. దూరంగా కూర్చున్న అతడు కూడా ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు. అతడిని చూడగానే తనతో ఏదో బంధం ఉన్నట్లుగా అనిపించిందట ఆమెకు. ఆ తర్వాత మళ్లీ రెండు నెలల తర్వాత ఆ వ్యక్తి తిరిగి అదే బస్ లో కనిపించాడట. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. కానీ ఇద్దరూ మాట్లాడుకోవడం కానీ ఒకరి వివరాలు మరొకరు తీసుకోవడం కానీ చేయలేదు. కానీ చాలా కాలం పాటు ఆ అమ్మాయి ఆ అబ్బాయిని మర్చిపోలేకపోయింది. అందుకే అతడిని గుర్తించేందుకు టిండర్‌లో ఓ పోస్ట్ పెట్టింది.
తన బయోలో.. "నేను 70 నంబర్ బస్ లో ఓ అబ్బాయిని చూశాను. నవ్వాను. 2019 నవంబర్ లో ఒకసారి, జనవరి 2020 లో మరోసారి మాత్రమే అతడిని చూశాను. ఒకవేళ మీరు ఆ వ్యక్తి అయితే సూపర్ లైక్ చేయండి. థ్యాంక్యూ" అని ఆ యువతి రాసుకుంది. ఆమె లక్ చాలా బాగుందని చెప్పుకోవాలి. ఆ అబ్బాయి కూడా అమ్మాయి బయో చూసి ఆమెకు రిప్లై ఇచ్చాడు. ఇలా చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుందని చెప్పాలి. ప్రస్తుతం వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారు.
ఆ అబ్బాయి మెసేజ్ చేస్తూ "ఇది కాస్త వింతగానే ఉంటుంది. కానీ మీరు బయోలో మాట్లాడేది నా గురించేమో అనిపిస్తోంది. నేను కూడా 70 నంబర్ బస్ లోనే ప్రయాణం చేసేవాడిని. నాకు మీ ముఖం చాలా బాగా గుర్తు. నేను కూడా మిమ్మల్ని రెండు మూడు సార్లు చూశానని నాకు అనిపిస్తోంది. అలా చూస్తే మాత్రం నేను తప్పక మిమ్మల్ని చూసి నవ్వి ఉంటాను. మిమ్మల్ని కలిసి ఓసారి కాఫీ, డ్రింక్స్ తీసుకోవాలనుకుంటున్నా" అంటూ మెసేజ్ చేశాడట. దానికి ఆ అమ్మాయి "అస్సలు వింతగా లేదు.. ఎందుకంటే నేను ఆ పోస్ట్ మీకోసమే పెట్టాను. మిమ్మల్ని ఎప్పటికైనా కలుస్తానో లేదో అనుకున్నాను. తప్పకుండా కలుద్దాం" అంటూ రిప్లై ఇచ్చిందట.
ప్రస్తుతం వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. దీని గురించి చెబుతూ "మొదటిసారి మేం కలిసినప్పుడు పదకొండు గంటల పాటు కలిసి ఉన్నాం. ఆ తర్వాత డేట్ తొమ్మిది గంటలు.. తర్వాత మళ్లీ పదకొండు గంటలు.. ఇన్ని సార్లు కలిశాక మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నామని మాకు అర్థమైంది. అందుకే ఇద్దరం కలిసి ఉండాలనుకున్నాం" అని వెల్లడించింది. ఈ వీడియోని చూసిన వారంతా వీరి ప్రేమను మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ కథతో సినిమా తీయొచ్చు అని ఒకరు రాస్తే.. నేను విన్న బెస్ట్ రిలేషన్ షిప్ స్టోరీ ఇది అని మరో యూజర్ కామెంట్ చేశారు. ఎంత అద్భుతమైన కథ అని మరో యూజర్ కామెంట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, International, International news, Love, Love story, Us news