ఇండియా రేటింగ్‌ను మరింత తగ్గించిన మూడీస్‌... ఇవీ కారణాలు...

దేశంలో 8 టాప్ కంపెనీలకు షాక్... డౌన్‌గ్రేడ్ చేసిన మూడీస్... (File)

Why Moody's downgraded India : భారత రేటింగ్‌ను మూడీస్... BAA2 నుంచి BAA3కి తగ్గించి... రేటింగ్ అవుట్‌లుక్ నెగెటివ్‌లోనే కొనసాగిస్తామని తెలిపింది.

 • Share this:
  అసలే కరోనా వైరస్ ఇండియాని వదలట్లేదు. ఇలాంటి సమయంలో... ప్రపంచ రేటింగ్స్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్... భారత్‌కి ఇస్తున్న సార్వభౌమ స్థాయి (సావరిన్‌ రేటింగ్‌)ని తగ్గించింది. ఇన్నాళ్లూ రేటింగ్ BAA2గా ఉండగా... దాన్ని BAA3కి పడేసింది. దీని వల్ల భారత్‌కి ప్రపంచస్థాయిలో తీవ్ర నష్టం తప్పదు. నిజానికి S&P, ఫిచ్ (Fitch) లాంటి రేటింగ్ సంస్థలతో పోల్చితే... మూడీస్ మొదటి నుంచి భారత్‌ పట్ల పాజిటివ్ రేటింగ్సే ఇస్తూ వచ్చింది. తాజా నిర్ణయం వల్ల... విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఇండియా అంత అనుకూలమైన దేశం కాదనే భావన వ్యక్తం అవుతుంది.

  ఇవీ కారణాలు :
  ఇలా రేటింగ్ పడేయడానికి ప్రధానంగా 4 కారణాల్ని మూడీస్ లెక్కలోకి తీసుకుంది. 1.2017 నుంచి ఆర్థిక సంస్కరణల అమలు అంతంత మాత్రంగా ఉంది. 2.ఆర్థిక వృద్ధిరేటు మందగించింది. 3.కేంద్రం, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. 4.దేశ ఆర్థిక రంగంపై ఒత్తిడి పెరుగుతోంది.

  దేశంలో ఎన్నో సవాళ్లు :
  గతేడాది నవంబర్‌లో భారత BAA2 రేటింగ్ అవుట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి నెగెటివ్‌లోకి పంపింది మూడీస్. ఎందుకంటే దేశంలో ఆర్థిక పరిస్థితులు క్రమంగా దెబ్బతింటున్నాయని అభిప్రాయపడింది. ఇప్పుడు అదే నెగెటివ్ అవుట్‌లుక్‌ను కొనసాగిస్తామని తెలిపింది. ప్రభుత్వాల పాలసీలను అమలు చేయడంలో సంస్థలు ఫెయిలవుతున్నాయన్న మూడీస్... ఫలితంగా దేశ వృద్ధిరేటు తగ్గుతోందని తెలిపింది. మౌలిక వసతులు బలహీనంగా ఉండటం, కార్మిక చట్టాలు, భూసేకరణ, ఉత్పత్తుల మార్కెటింగ్ వంటి అంశాల్లో ఎదురవుతున్న కఠిన షరతులు ఇం‌డియా వృద్ధిరేటును పెరగనివ్వట్లేదని మూడీస్ తెలిపింది.

  రేటింగ్స్‌పై కరోనా ప్రభావం లేదు :
  మూడీస్ రేటింగ్ పడేసిందనగానే అంతా... కరోనా వల్లే అనుకుంటారు. కానీ... మూడీస్... కరోనాను లెక్కలోకి తీసుకోలేదు. ఆర్థిక పరమైన అంశాల్ని మాత్రమే లెక్కలోకి తీసుకొని రేటింగ్ పడేసింది. ఐతే... రేటింగ్ నెగెటివ్ అవుట్‌లుక్ ఉండటం వల్ల దేశం మరింత నెగెటివ్‌లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.

  2019-20లో భారత వృద్ధి రేటు 4.2 ఉంది. ఈ దశాబ్దంలోనే అది అతి తక్కువ. 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ 4 శాతం క్షీణిస్తుందని మూడీస్‌ తెలిపింది. దేశంలో ఆదాయాలు తగ్గుతుంటే... వ్యయాలు పెరుగుతున్నాయి. అందువల్ల ద్రవ్యలోటు కూడా పెరుగుతోంది. మున్ముందు ఇది మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.

  ఎందుకీ రేటింగ్స్ :
  విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఈ రేటింగ్స్‌ను లెక్కలోకి తీసుకుంటాయి. రేటింగ్స్ బాగున్న దేశాల్లో ఎక్కువ పెట్టుబడులు పెడతాయి. ఉదాహరణకు... చైనా నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న విదేశీ కంపెనీలు... ఇప్పుడు ఇండియాలో పెట్టుబడులు పెట్టాలనీ, ఇండియాకి రావాలని అనుకునేందుకు వెనకాడతాయి. ఎందుకంటే... ఇండియా రేటింగ్ మరింత పడిపోయింది కాబట్టి. రేటింగ్స్ పడేస్తే... ఇలాంటి అతి పెద్ద ఆర్థిక సమస్యలు తప్పవంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరింత పటిష్టమైన ఆర్థిక సంస్కరణల్ని అంతే పటిష్టంగా అమలు చెయ్యాల్సిన అవసరం ఉందంటున్నారు.
  Published by:Krishna Kumar N
  First published: