వొడాఫోన్ ఐడియా నుంచి బయటికి వెళ్లేందుకు కేఎం బిర్లా ఎందుకు సిద్ధపడ్డారు.. వీఐకి వచ్చిన కష్టాలేంటి..?

మంగళం బిర్లా (ఫైల్)

ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ/Vi) నానాటికీ పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోతోంది. అప్పులు.. కొండలా మోయలేని గుదిబండలా మారిపోయాయి. రుణ భారాన్ని తగ్గించుకునేందుకు వొడాఫోన్ ఐడియా చేస్తున్న విశ్వప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ తరుణంలో వీఐ సంస్థ చైర్మన్ కుమార మంగళం బిర్లా సంచలన ప్రకటన చేశారు

  • Share this:
ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ/Vi) నానాటికీ పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోతోంది. అప్పులు.. కొండలా మోయలేని గుదిబండలా మారిపోయాయి. రుణ భారాన్ని తగ్గించుకునేందుకు వొడాఫోన్ ఐడియా చేస్తున్న విశ్వప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ తరుణంలో వీఐ సంస్థ చైర్మన్ కుమార మంగళం బిర్లా సంచలన ప్రకటన చేశారు. కంపెనీ మళ్లీ పుంజుకుంటుందంటే వీఐలో ఉన్న తన వాటాలన్నింటినీ అమ్మేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తాను స్థాపించిన ఐడియా నుంచి బయటికి వెళ్లేందుకు రెడీ అన్నారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబాకు బిర్లా లేఖ రాశారు. వీఐ సంస్థను కాపాడేందుకు అన్ని సాధ్యమైన ఆప్షన్లను పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇందుకోసం ప్రభుత్వంతో పని చేసేందుకు ఆసక్తి ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియాలో కుమార మంగళం బిర్లాకు 27 శాతం వాటా కలిగి ఉన్నారు. వొడాఫోన్ ఐడియా మొత్తంగా దాదాపు రూ.1.5 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్​) కింద డిపార్ట్​మెంట్ ఆఫ్ టెలికం (డీవోటీ)కు వీఐ సంస్థ దాదాపు రూ.60కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. అలాగే బ్యాంకులతో సహా వివిధ ఆర్థిక సంస్థలకు రూ.23వేల కోట్ల రుణాలు తీర్చాల్సి ఉంది. దీంతో ఆ సంస్థ తీవ్రమైన కష్టాల్లో కూరుకుపోయింది. మరోవైపు ఏజీఆర్​ చెల్లింపుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో 2019 అక్టోబర్​లోనే ఐడియాకు తీవ్రమైన ఇబ్బందులు నెలకొన్నాయి. ఒకవేళ ప్రభుత్వం సాయం చేయకపోతే సంస్థ మూయాల్సి వస్తుందేమోనని అప్పట్లోనే కుమార మంగళం బిర్లా ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే ఈ ఏడాది జూన్​లోనూ ప్రభుత్వానికి బిర్లా లేఖ రాశారు. ఇక సంస్థను కాపాడుకునే ఆఖరి చర్యల్లోనే భాగంగా ప్రభుత్వాన్ని సాయం కోరుతూ బిర్లా లేఖలు రాస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు స్థిరమైన పాలసీ లేనంత వరకు విదేశీ ఇన్వెస్టర్లు కూడా భారతీయ టెలికం సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదని కూడా ఈ లేఖలతో ప్రభుత్వానికి బిర్లా చెబుతున్నట్టు ఉందని అంచనా వేస్తున్నారు. మూతపడే పరిస్థితికి వస్తే వొడాఫోన్ ఐడియాను డిపార్ట్​మెంట్ ఆఫ్ టెలికం స్వాధీనం చేసుకుంటుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సాంకేతికంగా చూసుకుంటే ఇది సాధ్యమే. వొడాఫోన్ ఐడియా అప్పులను ఈక్విటీగా మార్చి, తమ ఆధీనంలో ఉన్న భారత సంచార్ నిగమ్ లిమిటెడ్​ (బీఎస్​ఎన్​ఎల్​)లో కలిపితే వి సంస్థ మళ్లీ పుంజుకుంటుందని డచ్ బ్యాంకు ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది. అయితే ఇప్పటికే చాలా ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో నడుస్తున్న నేపథ్యంలో.. ఇన్ని కష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియాను కేంద్రం ఆధీనంలోకి తీసుకునే అవకాశాలు ఉండవని కొందరు అధికారులు, టెలికం రంగ నిపుణులు గట్టిగా చెబుతున్నారు.

ఇప్పుడేం చేయాలి..
ప్రస్తుతం అప్పుల్లో ఉన్న వీఐ.. తమ కస్టమర్లకు నిరాటంకంగా సేవలు అందించేందుకు డైలీ ఆపరేషన్లు చేయాలన్నా ఇప్పటికిప్పుడు నిధులను సమీకరించాల్సిన అవసరం ఉంది. రానున్న నెలల్లో తప్పకుండా ఫండ్​ రైస్ చేయాల్సిందేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అలాగే రుణాలను తగ్గించుకునేందుకు నిధులను వినియోగించాలని వీఐకు సూచిస్తున్నారు. మరోవైపు నిధులను సమీకరించేందుకు వీఐ చేస్తున్న ప్రయత్నాలు కూడా అంత సఫలం కావడం లేదు. టారిఫ్ రేట్లను పెంచితే వీఐ కొంతైనా గట్టెక్కుతుందని నిపుణులు చెబుతుంటే.. ఉన్న వినియోగదారులు చేజారిపోతారేమోనని సంస్థ ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వొడాఫోన్ ఐడియాకు 27 కోట్ల మంది సబ్​స్కైబర్లు ఉన్నారని లెక్కలు చెబుతున్నా.. ఆ సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని ఇటీవల కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మొత్తానికి సంస్థను కాపాడుకునేందుకు ఏకంగా తానే తప్పుకుంటానని చైర్మన్ కుమార మంగళం బిర్లా చెప్పడం చూస్తే వొడాఫోన్ ఐడియా ఎంత కష్టాల్లో ఉందో తేటతెల్లం చేస్తోంది.
Published by:Veera Babu
First published: