క్రిస్మస్ వేడుకలకు ప్రపంచం సిద్ధమైంది. ఏసుక్రీస్తు పుట్టిన రోజును ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. క్రిస్మస్ ట్రీలను స్టార్లు, విద్యుద్దీపాలతో చూడముచ్చటగా అలంకరిస్తున్నారు. ఈ వేడుకల్లో క్రిస్మస్ చెట్లకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వాటిని బాలఏసుగా భావిస్తారు. అందుకే అందంగా, రంగురంగులతో, లైట్లతో అలంకరిస్తారు. పదుల సంఖ్యలో జాతులకు చెందిన ఎప్పటికీ ఎండిపోని(Ever Green) చెట్లను క్రిస్మస్ ట్రీలుగా వినియోగిస్తారు.
క్రిస్మస్ ట్రీ సంప్రదాయం జర్మనీలో ప్రారంభమైంది. 1510లో ఈ పద్ధతి మొదలైంది. అప్పుడు జర్మన్లు ఇళ్ల వద్ద చెట్లను పండ్లతో అలంకరించే వారట. పారడైజ్ ట్రీ అని పులుచుకునే వారు. జర్మనీ సంస్కరణకర్త మార్టిన్ లూథర్.. క్రిస్మస్ ట్రీని అలంకరించే విధానాన్ని మొదలు పెట్టారని వాదన ఉంది.
19వ శతాబ్దంలో ఈ క్రిస్మస్ ట్రీ సంస్కృతి అమెరికాకు చేరింది. జర్మనీ నుంచి అక్కడికి వలస వెళ్లిన వారు అగ్రరాజ్యంలో ఈ పద్ధతిని అనుసరించారు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా క్రిస్మస్ ట్రీలు అమెరికాలో ఉన్నాయి. ప్రస్తుతం విశ్వమంతా క్రిస్మస్ ట్రీలు ముచ్చుటగొలుపుతున్నాయి.
అమెరికాలోని తోటల్లో ప్రస్తుతం 35కోట్లకు పైగా క్రిస్మస్ చెట్లు పెరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. 15వేల తోటల్లో మొక్కలను పెంచుతున్నారు. దీని ద్వారా దాదాపు లక్ష మందికి ఉపాధి లభిస్తోందట. దాదాపు 98శాతం క్రిస్మస్ ట్రీలు తోటల్లోనే పెరుగుతాయి. పండుగ సమయంలో వాటిని కొని ఇళ్ల దగ్గర అలంకరించుకుంటారు. ఇళ్ల దగ్గర వీటిని పెంచుకునే వారు 2శాతం మంది మాత్రమే.
నార్డ్మన్ ఫర్ చెట్లను ఎక్కువగా క్రిస్మస్ ట్రీగా వాడుతన్నారు. యూరప్, అమెరికాలో ఎక్కువగా ఈ జాతి చెట్లనే వినియోగిస్తున్నారు.
క్రిస్మస్ ట్రీలను మొదట కొవ్వొత్తులతోనే అలంకరించేవారు. అయితే విద్యుద్దీపాలతో అలంకరించాలని ఎలక్ర్టిక్ బల్బు ఆవిష్కరణ కర్త థామస్ అల్వా ఎడిసన్ అసిస్టెంట్ ఎడ్వర్డ్ జాన్సన్ 1882లో ప్రతిపాదన తెచ్చారు. ఆ తర్వాతి నుంచి క్రిస్మస్ లైట్లు సైతం భారీ సంఖ్యలో ఉత్పత్తి అయ్యాయి. 1900ల్లో క్రిస్మస్ ట్రీల మార్కెట్ అతి పెద్దగా విస్తరించింది. ప్రస్తుతం రంగు రంగుల లైట్లతో చెట్లను జిగేల్మనిపిస్తున్నారు.
క్రిస్మస్ ట్రీ ఆరు నుంచి ఏడు అడుగుల ఎత్తు పెరిగేందుకు దాదాపు 15 సంవత్సరాలు పడుతుందట. అదే కొన్ని చెట్ల నాలుగు సంవత్సరాల్లోనే పెరుగుతాయి.. మొత్తంగా క్రిస్మస్ ట్రీలు పెరిగేందుకు సగటున 7 సంవత్సరాలు పడుతుందని అమెరికా జాతీయ క్రిస్మస్ ట్రీ అసోసియేషన్ లెక్కలు చెబుతున్నాయి.
1889లోనే క్రిస్మస్ ట్రీ సంప్రదాయం అమెరికా అధికారిక భవనం వైట్ హౌస్లో ప్రారంభమైంది. అయితే క్రిస్మస్ ట్రీ లైటింగ్ కార్యక్రమం మాత్రం మొదటిసారి 1923లో జరిగింది.