news18-telugu
Updated: November 9, 2020, 3:40 PM IST
ప్రతీకాత్మక చిత్రం
భారత్‌లో డిజిటల్ పేమెంట్లు చేసే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అనేక సంస్థలు వినియోగదారుల సౌలభ్యం కోసం ఈ తరహా చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెడుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో మేస్సేజింగ్ యాప్ వాట్సాప్ కూడా చేరింది. తాజాగా ఆ సంస్థ ‘వాట్సాప్ పే’ సేవలను భారతదేశంలో అధికారికంగా ప్రవేశపెట్టింది. ఐఫోన్, ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఈ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫాంను వాట్సాప్ అభివృద్ధి చేసింది. ఇప్పటి వరకు మెస్సేజింగ్ యాప్‌లలో రారాజుగా ఉన్న వాట్సాప్ ద్వారా వినియోగదారులు లావాదేవీలు కూడా చేసుకోవచ్చు.
భారతదేశంలో 160కి పైగా బ్యాంకుల మద్దతు ఉన్న రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ అయిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ద్వారా వాట్సాప్ పే పనిచేయనుంది. ట్రయల్ పీరియడ్‌లో భాగంగా ఇప్పటి వరకు కొంతమంది వినియోగదారులకు మాత్రమే వాట్సాప్ పే అందుబాటులో ఉంది. తాజాగా ఈ సేవలను వాట్సాప్ అధికారికంగా కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది.
పోటీ సంస్థలపై జోకులు
‘ఈ రోజు నుంచి భారతదేశంలో ప్రజలు వాట్సాప్ ద్వారా డిజిటల్ పేమెంట్లు చేసుకోవచ్చు. ఈ సురక్షిత చెల్లింపుల సేవలను మెస్సేజ్ చేసినంత సులభంగా పూర్తి చేయవచ్చు’ అని వాట్సాప్ నవంబరు ఆరున ట్విట్టర్లో ప్రకటించింది. ఇప్పటికే గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి పేమెంట్ యాప్స్‌కు వాట్సాప్ పే పోటీగా మారనుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రజలు జోకులు, మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. WhatsAppPay అందుబాటులోకి వచ్చిన తరువాత ఇతర సంస్థలు భయపడుతున్నట్లు మీమ్స్ తయారు చేసి సమాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. వాట్సాప్‌లో ఛాటింగ్ చేస్తూ, కొంత డబ్బు పంపమని అడిగిన వారిని బ్లాక్ చేస్తున్నట్లు ఒక వినియోగదారుడు ఫోటో క్రియేట్ చేశాడు. ఫోన్లో WhatsAppPayని ఉపయోగిస్తున్నప్పుడు Paytm, ఇతర పేమెంట్ యాప్‌లు పనిలేక మాట్లాడుకుంటున్నట్లు మరో కస్టమర్ మీమ్ తయారు చేసి పోస్ట్ చేశాడు.
వారిపైనే వాట్సాప్ ఆశలు
ఇప్పటికే మెస్సేజింగ్ అప్లికేషన్లలో వాట్సాప్ ఇతర సంస్థలకు అందనంత ఎత్తులో ఉంది. కొత్తగా పేమెంట్ సేవలను ప్రారంభించిన తర్వాత చాలామంది కస్టమర్లు ఇతర పేమెంట్ యాప్‌ల నుంచి తమ సేవలకు మారే అవకాశం ఉందని వాట్సాప్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పేటీఎం, ఫోప్పే, గూగుల్ పే వంటి సంస్థలకు పని లేకుండా పోతుందని జోకులు, మీమ్స్ తయారు చేస్తున్నారు. వాట్సాప్ ద్వారా తమ స్నేహితులు సులభంగా డబ్బు అడిగే అవకాశం లభించిందని చాలా మంది వినియోగదారులు చమత్కరిస్తున్నారు.
బ్యాంకులతో ఒప్పందం
వాట్సాప్ పే సేవల కోసం వివిధ బ్యాంకులతో ఒప్పందం చేసుకుంది. ఈ జాబితాలో యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్, ఆర్బిఎల్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యుకో బ్యాంక్, యెస్ బ్యాంక్ వంటివి ఉన్నాయి. పేమెంట్ ఆప్షన్‌ను ఉపయోగించడానికి వినియోగదారులు వాట్సాప్‌ను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు బ్యాంక్ అకౌంట్‌తో అనుసంధానించిన ఫోన్ నంబరుతో వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేస్తేనే, వాట్సాప్ పే సేవలను కస్టమర్లు వినియోగించుకునే అవకాశం ఉంది.
Published by:
Nikhil Kumar S
First published:
November 9, 2020, 3:37 PM IST