ఆ విమానం ఏమైపోయింది?.. ఐదేళ్లు గడిచినా మిస్టరీగానే..

విమానం అదృశ్యమైన తర్వాత 7 గంటల పాటు గాలిలో ప్రయాణించింది. అంతేకాకుండా అది అదృశ్యమైన కాసేపటికి ఊహించని విధంగా పశ్చిమంవైపు మరలి, మలేషియాలోని పెనిన్సులా గుండా ప్రయాణించి, అక్కడి నుంచి మరోవైపు మళ్లింది.

news18-telugu
Updated: April 25, 2019, 4:17 PM IST
ఆ విమానం ఏమైపోయింది?.. ఐదేళ్లు గడిచినా మిస్టరీగానే..
ఐదేళ్ల క్రితం అదృశ్యమైన మలేషియా విమానం...
  • Share this:
అది 2014, మార్చి 8.. ఐదుగురు భారతీయులు, ఇద్దరు చిన్నారులు సహా 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో విమానం బయలు దేరింది.. కానీ, కాసేపటికే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి.. రాడార్ స్క్రీన్లన్నీ మూగబోయాయి.. విమానం ప్రమాదానికి గురైందని గుర్తించిన అధికారులు వెతుకులాట ప్రారంభించారు. ఆ వెతుకులాట ఒకటి, రెండు, మూడు రోజులు... నెలలు, సంవత్సరాల పాటు నడిచింది. అయినా, ఇప్పటికీ దొరకలేదు.. అదే మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ‘ఎంహెచ్ 370’ విమానం. కౌలలంపూర్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆ విమానం ఏమైపోయింది? అనే విషయం ఐదేళ్లు గడిచినా తెలియడం లేదు. ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. 26 దేశాలు రంగంలోకి దిగి వెతికినా లాభం లేకపోయింది.

అయితే, జల సమాధి అయ్యిందని చెబుతన్న ఆ విమానం అసలు సముద్రంలో కుప్పకూలలేదా? హైజాక్‌కు గురైందా? కాకపోతే మరేమైంది? అని కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయిప్పుడు. ఎందుకంటే.. బీబీసీ రూపొందించిన ఓ వీడియో డాక్యుమెంటరీ కొత్త సందేహాలకు తావిస్తోంది. ఎంహెచ్ 370 కు శాటిలైట్ కమ్యూనికేషన్స్ అందించే ఇన్‌మర్‌సత్ కంపెనీలో పనిచేసిన పలువురు శాస్త్రవేత్తలు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఆ విమానంలో 200 కిలోల లిథియం బ్యాటరీలు ఉన్నాయని, అందులో మంటలు అంటుకొని, పేలిపోయి దక్షిణ హిందూ సముద్రంలో పడిపోయిందని భావించారు. కానీ, విమానానికి సంబంధించిన శకలాలేవీ సముద్రంలో దొరకలేదు. దీంతో ఆ వాదనే తప్పని కొట్టిపారేశారు.

మరో వాదన ప్రకారం, విమానం అదృశ్యమయ్యాక విమానానికి, గ్రౌండ్ స్టేషన్‌కు మధ్య ఏడు సంఘటలు చోటుచేసుకున్నాయట. రాడార్ స్క్రీన్ల నుంచి సిగ్నల్ అదృశ్యమైన 60 నిమిషాలకు గ్రౌండ్ స్టేషన్ పంపిన సిగ్నల్‌కు స్పందించిందని అలెన్ అనే శాస్త్రవేత్త వెల్లడించారు. ఆయన ప్రకారం.. విమానం అదృశ్యమైన తర్వాత 7 గంటల పాటు గాలిలో ప్రయాణించింది. అంతేకాకుండా అది అదృశ్యమైన కాసేపటికి ఊహించని విధంగా పశ్చిమంవైపు మరలి, మలేషియాలోని పెనిన్సులా గుండా ప్రయాణించి, అక్కడి నుంచి మరోవైపు మళ్లింది. అంటే.. హైజాక్‌కు గురైందా? ఉగ్రవాదులు దాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారా? అని ప్రశ్నలు తలెత్తాయి. కానీ, అలాంటిదేమీ జరగలేదని తేలింది.

పెనిన్సులా గుండా ప్రయాణించిన ఆ విమానం దక్షిణం వైపు మళ్లిందని గుర్తించిన శాస్త్రవేత్తలు దక్షిణ హిందూ మహా సముద్రం వద్దకు వచ్చి ఆగిపోయిందని తేల్చారు. అటుగా వెళ్లిన విమానం సముద్రంలో కుప్పకూలనప్పుడు ఏమైపోయింది? ఎటు వెళ్లింది? అనేది మిస్టరీగానే ఉండిపోయింది.
Published by: Shiva Kumar Addula
First published: April 25, 2019, 3:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading