• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • WEDDING GUESTS END UP DOING FROG JUMPS FOR LOCKDOWN VIOLATION IN MADHYA PRADESH SU

Viral Video: పెళ్లి చూద్దామని వస్తే.. కప్ప గంతులు వేయాల్సి వచ్చింది.. అసలు ఏం జరిగిందంటే..?

(Image-Twitter)

ఓ పెళ్లికి వచ్చిన అతిథులకు ఊహించని పరిణామం ఎదురైంది. పెళ్లిలో ఎంజాయ్ చేద్దామని వచ్చినవారు.. చివరకు కప్ప గంతులు వేయాల్సి వచ్చింది.

  • Share this:
    దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. అలాగే లాక్‌డౌన్ కూడా విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు పరిమిత సంఖ్యలో అతిథులు హాజరయ్యేందుకు అనుమతిస్తున్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ పెళ్లి వేడుకకు పరిమితికి మించి వందలాదిగా అతిథులు హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు.. అక్కడికి చేరుకుని పెళ్లికి హాజరైన అతిథులకు వింత శిక్ష విధించారు. వివరాలు.. మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలోని ఉమరి గ్రామంలో ఓ పెళ్లి వేడుకకు దాదాపు 300 మంది అతిథులు హాజరయ్యారు. ఇది పూర్తిగా కోవిడ్ లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘనకు దారితీసింది.

    మరోవైపు లాక్‌డౌన్ నిబంధనల పాటిస్తున్నారా? లేదా అనే అంశంపై అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ పెళ్లి వేదిక వద్దకు పోలీసు అధికారులు చేరుకున్నప్పుడు అక్కడ పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించినట్టు తెలుసుకున్నారు. అయితే పోలీసులు వచ్చిన విషయం తెలుసుకున్న వెంటనే పలువురు అక్కడి నుంచి పారిపోయారు. చివరకు పోలీసులు పెళ్లికి హాజరైన కొందరు అతిథులు పట్టుకున్నారు. దాదాపు 17 మంది పురుషులకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారితో రోడ్డుపై కప్ప గంతులు వేయించారు. అందులో ఓ వ్యక్తి సరిగ్గా కప్ప గంతులు వేయకపోవడంతో ఓ పోలీసు అధికారి అతని కొట్టడానికి వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.



    ఈ శిక్ష అనంతరం పోలీసులు.. లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్నంతవరకు అలాంటి సమావేశాలకు హాజరుకావద్దని వారిని హెచ్చరించారు. ఆ తర్వాత వారిని వదిలివేశారు. ఇక, మధ్యప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 5,065 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7.4 లక్షలు దాటింది. ఇప్పటివరకు మధ్యప్రదేశ్‌లో కరోనాతో 7,227 మంది మృతిచెందారు.
    Published by:Sumanth Kanukula
    First published: