సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు క్షణాల్లో వైరల్‌గా మారిపోతాయి. అందులో కొన్ని ఫన్నీగా, కొన్ని హృదయ విదారకంగా, కొన్ని ఆసక్తికరంగా.. ఉంటాయి. అయితే తాజాగా ఓ ఏనుగు ఫన్నీ వీడియో ట్విట్టర్లో వైరల్‌గా మారింది. సుశాంత నంద అనే ఐఎఫ్ఎస్ అధికారి ఈ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో పెద్ద ఏనుగు వద్ద ఉన్న గున్న ఏనుగు.. నిల్చుని ఉండగానే నిద్రలోకి జారుకుంది. అయితే ఆ సమయంలో పెద్ద ఏనుగు కాలు తాకినట్టు అవ్వడంతోనే వెనకకు పడిపోయింది. దీంతో అక్కడున్న ఏనుగులు అన్ని ఒక్కసారిగా కంగారు పడిపోయాయి. పెద్ద ఏనుగుతో పాటు, అక్కడే ఉన్న మరికొన్ని ఏనుగులు కూడా గున్న ఎనుగు వద్దకు పరుగులు తీశాయి.
ఈ వీడియోను షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి నంద.. ఇది తన సైనిక్ స్కూల్ రోజులను గుర్తచేసింది అని పేర్కొన్నారు. ఇక, ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. వీడియో చాలా క్యూట్‌గా ఉందంటూ మెజారిటీ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పాపం ఆ గున్న ఏనుగు రాత్రి నిద్రపోలేదోమోనని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.